తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటనలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన కేసులో బాధితురాలిగా ఉన్న హర్షవీణపై ఆయన భౌతిక దాడి చేసినట్లు సమాచారం బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రైల్వేకోడూరు టోల్‌గేట్ సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల విడుదల చేసిన వీడియోలో హర్షవీణ తనకు జరిగిన అన్యాయంపై నేరుగా జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. తనకు న్యాయం చేయాల్సిన వారు నిర్లక్ష్యం చేస్తున్నారని, తనపై అన్యాయం చేసిన వ్యక్తి మాత్రం పార్టీ కార్యక్రమాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల మధ్యే ఆమెపై దాడి జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ దాడి వెనుక పెద్దస్థాయి కుట్ర ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నడిరోడ్డుపై పార్టీకి చెందిన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఇలాంటి చర్యకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో, గతంలో సుగాలి ప్రీతి కేసులో కూడా హామీలు ఇచ్చి తరువాత నిర్లక్ష్యం చేసిన ఘటనను మహిళా సంఘాలు గుర్తుచేస్తున్నాయి. న్యాయం కోరుతున్న మహిళలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఈ ఘటనపై మహిళా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధితురాలిపై దాడి చేసిన తాతంశెట్టి నాగేంద్రతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ శ్రీధర్‌ను తక్షణం పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేన పార్టీ ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.






