టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ (Swachh Andhra Corporation) చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommarreddy Pattabhiram) నిర్వహించిన తాజా ప్రెస్ మీట్‌తో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అభివృద్ధిపై రాజకీయ చర్చ కొత్త మలుపు తిరిగింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి 2015లోనే ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొంటూ, సీఆర్డీయే (CRDA) పరిధి అమరావతితో మాత్రమే పరిమితం కాదని, విజయవాడ, గుంటూరు, తెనాలి నగరాలు కూడా అందులో భాగమేనని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో, జగన్ ప్రతిపాదించిన మావిగన్ భావనను పరోక్షంగా తమదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ప్రకటనల నేపథ్యంలో అమరావతి ప్రాజెక్ట్ (Amaravati Project) ఆర్థిక సామర్థ్యంపై మరింత చర్చ మొదలైంది. అమరావతి 29 గ్రామాల్లో కోర్ క్యాపిటల్ (Core Capital) నిర్మాణానికి భారీ వ్యయం అవసరమవుతుందని, దీనికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అనేక వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. జీవో 141 ప్రకారం 29 గ్రామాల్లో 217.23 చదరపు కిలోమీటర్లలో నిర్మాణాలు చేపట్టడం ఆర్థికంగా భారమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఆ గ్రామాల్లో సేకరించిన భూముల్లో కనీస మౌళిక సదుపాయాలు కూడా లేకపోవడం.
దీనికి విరుద్ధంగా, జగన్ ప్రతిపాదించిన మావిగన్ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) కారిడార్ అభివృద్ధి మోడల్ తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రాజధాని నిర్మాణాన్ని సాధ్యమయ్యేలా చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలను అనుసంధానించి కారిడార్‌గా తీర్చిదిద్దడం ద్వారా మౌలిక సదుపాయాల ఖర్చు తగ్గించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, సీఆర్డీయే పరిధిలోనే విపరీతమైన ఖర్చుతో కూడుకున్న ఆ 29 గ్రామాల్లో కాకుండా ఇతర ప్రాంతాలను కోర్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేయాలన్న సూచనలను టీడీపీ వర్గాలు అంగీకరించకపోవడం వివాదానికి కారణమవుతోంది. 29 గ్రామాల్లో కాకుండా అక్కడ నుండి బయటకి వచ్చి గుంటూరు, విజయవాడ ప్రాంతాల అభివృద్ధిని కోర్ క్యాపిటల్‌గా పరిగణించడంపై టీడీపీకి(TDP) ఉన్న విభేదాలు ప్రజల్లో వీరి వైఖిరి పట్ల పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
మొత్తానికి, ఆర్థిక పరంగా చూస్తే మావిగన్ ప్రణాళిక వేగవంతమైన, ఖర్చు తక్కువైన పరిష్కారంగా కనిపిస్తుండగా, అమరావతి ప్రాజెక్ట్‌పై సందేహాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏ మోడల్ రాష్ట్ర అభివృద్ధికి అనుకూలమవుతుందో అన్నది రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా కీలక అంశంగా మారింది.





