రాజధాని అంశంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రతిపాదించిన మావిగన్ (Mavigan) కాన్సెప్ట్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనతో ప్రజల్లో విస్తృత చర్చ మొదలైందని, అదే సమయంలో అధికార వర్గాల్లో ఆందోళన పెరిగిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో (Nara Chandrababu Naidu) భయం మొదలైందని కూడా ఆయన ఎద్దేవా చేశారు.
జగన్‌ను ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు
జగన్ ఆలోచనల వల్ల తమ అవినీతి వ్యవస్థ బలహీనపడుతుందన్న భయంతోనే కూటమి ప్రభుత్వం మావిగన్‌పై దుష్ప్రచారం చేస్తోందని కాకాణి ఆరోపించారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యేలకు(TDP MLAs) పైస్థాయి నుంచి వ్యక్తిగత విమర్శలు చేయాలన్న సూచనలు వచ్చాయని, పదవులు పొందేందుకు కొందరు నేతలు పోటీ పడి జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు.
రాబోయే రోజుల్లో మహిళలు సహా ప్రజలే ఈ రాజకీయాలకు సమాధానం చెబుతారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని ఆయన విమర్శించారు.






