రాష్ట్రంలో మరో సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister Relief Fund – CMRF) పేరుతో అందుతున్న ఆర్థిక సాయం కూడా అవినీతి (Corruption) బారిన పడుతున్నదన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. రాజంపేట (Rajampet) ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసాన్ని ప్రశ్నించేలా మారింది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒక కన్ను కోల్పోయిన తుంటి ఎల్లయ్యకు (Tunti Ellayya) ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.14 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ సాయం అతని చికిత్సకు, జీవనోపాధికి ఉపయోగపడాల్సి ఉండగా, మధ్యలోనే అక్రమాలకు గురైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాధితుడిని బ్యాంక్‌కు(Bank) తీసుకెళ్లిన స్థానిక టీడీపీ(TDP) నాయకుడు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ (Venugopal), అవసరమైన ప్రక్రియల పేరుతో అతని వద్ద సంతకాలు తీసుకున్నారని సమాచారం. అనంతరం మొత్తం రూ.14 లక్షలు అతని ఖాతాలో జమ అయినప్పటికీ, కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే రూ.8 లక్షలు మరో ఖాతాకు బదిలీ అయినట్లు తెలుస్తోంది.
ఇంటికి చేరుకున్న తర్వాత మొబైల్ సందేశాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎల్లయ్య షాక్‌కు గురయ్యాడు. వెంటనే టీడీపీ నాయకుడు వేణుగోపాల్ ను ప్రశ్నించగా, “ఖర్చులు ఉంటాయి, పర్సెంటేజీలు (Percentages) ఇవ్వాలి” అనే సమాధానం ఇచ్చినట్లు బాధితుడు వెల్లడించాడు.
ఈ ఘటన బయటపడటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహాయ నిధుల వంటి సున్నితమైన వ్యవస్థల్లో కూడా ఇలాంటి అవకతవకలు చోటుచేసుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






