మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు తన ప్రియురాలికి హెచ్ఐవీ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడటం మరింత విషాదాన్ని మిగిల్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి ఇంజినీరింగ్ చదువుతోంది. కుటుంబ సభ్యుల పరిచయంతో మనోహర్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అయితే వైద్య పరీక్షల్లో మనోహర్‌కు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో యువతి కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. ఈ విషయాన్ని మనోహర్ అంగీకరించలేకపోయాడు.
మార్చి 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. యువతి తిరస్కరించడంతో ముందే సిద్ధం చేసిన ప్లాన్ ప్రకారం హెచ్ఐవీ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం యువతికి జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించగా, డాక్టర్ల ప్రశ్నలకు ఆమె అసలు విషయం వెల్లడించింది.
యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు.
ఇక అవమానాన్ని భరించలేక యువతి అన్నోజిగూడలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సమాజంలో తీవ్ర చర్చకు దారి తీసింది.
పోలీసుల దర్యాప్తులో మనోహర్ ఇప్పటికే హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు తేలింది. తనతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేందుకు, ఆమెకు కూడా అదే వ్యాధి వస్తే పెళ్లి చేసుకుంటుందని భావించి ఈ దారుణానికి పాల్పడ్డట్లు వెల్లడించాడు.






