మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ వరుస వివాదాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే గత నెలలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట కేసులో ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో సీఐ వెంకట రమణ సస్పెండ్ కావడం పెద్ద సంచలనంగా మారింది. ఆ ఘటనలో చౌడమ్మ అనే యువతి పరువు హత్యకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఇప్పుడు మరోసారి అదే స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఏఎస్ఐ శ్రీనివాసరావు వ్యవహారం ముందు నుంచే వివాదాస్పదంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అతను తరచూ ఒక ఆటోలో వెళ్లి బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రేమ జంటలు, మద్యం సేవిస్తున్న వారిని రహస్యంగా వీడియోలు తీసి, తర్వాత వాటిని చూపిస్తూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక బాధితుల వాంగ్మూలాల ప్రకారం, మద్యం మత్తులోనే డ్యూటీ నిర్వర్తించడం మాత్రమే కాకుండా, మహిళలు మరియు యువతులను లైంగికంగా వేధిస్తూ కోరికలు తీర్చాలని ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపణలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఈ వ్యవహారంలో జమ్మలమడకకు చెందిన ఓ ఆటో డ్రైవర్ సహకారంతో వీడియోలు చిత్రీకరించిస్తున్నట్టు సమాచారం బయటపడుతోంది.
ఇదే స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై, కానిస్టేబుల్లపై కూడా ఇలాంటి వేధింపుల ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. పోలీసులే న్యాయం చేయాల్సిన స్థితిలో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు మాచర్ల పోలీస్ స్టేషన్ వ్యవహారంపై దృష్టి సారించినట్లు సమాచారం. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్రంలో చట్టవ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందన్న భావన ప్రజల్లో పెరుగుతుండటం గమనార్హం.






