---Advertisement---

ధ్వంసమైన విగ్రహ నిమజ్జనం – బోడికొండపై మరోసారి రాజకీయ వేడి పెరుగనుందా?

April 12, 2026

---Advertisement---

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండ ఆలయం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. 2020 డిసెంబర్ 28 అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పురాతన కోదండ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి తీసుకెళ్లిన ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది.

ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. ఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం కోసం జిల్లాలో పర్యటించడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో అనుమానాస్పద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో ఆలయానికి సీసీ కెమెరాలు అమర్చే పనులు జరుగుతున్న సమయంలోనే ఈ దాడి జరగడం అనేక అనుమానాలకు దారితీసింది.

అనంతరం పోలీసులు సేకరించిన ఆధారాల మేరకు రామతీర్థం వార్డు మాజీ సభ్యులు చందక సూరిబాబు, రాంబాబుతో పాటు కొంతమంది టీడీపీ సభ్యులను అదుపులోకి తీసుకోవడం పరిస్థితిని మరింత రాజకీయంగా మలిచింది. బోడికొండపై ఉన్న కోదండ రామస్వామి దేవాలయాన్ని, అదే ఊరిలోని ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలుచుకునే రామతీర్థం ప్రసిద్ధ దేవాలయంతో ముడిపెట్టి, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే రామతీర్థం ఆలయంలోనే ఈ ఘటన జరిగిందని ప్రచారం చేయడం ద్వారా భక్తుల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత హడావిడిగా బోడికొండకు రావడం పై కూడా పలు విమర్శలు వచ్చాయి. తమ పార్టీకి చెందిన వ్యక్తులు చేసిన పని ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందనే ఆందోళనతో రామతీర్థానికి వచ్చి ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీపై మతాలకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా అనుమానాలకు దారితీసిందని విమర్శలు వినిపించాయి.

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో నాటి ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టింది. సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నూతన రాతి ఆలయాన్ని నిర్మించి, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ సీతారామలక్ష్మణుల నూతన విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గాన్ని కూడా పునరుద్ధరించారు.

అయితే, తరువాతి రాజకీయ పరిణామాలు మరోసారి వివాదాలకు దారితీశాయి. ప్రభుత్వం మారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహ ధ్వంసం కేసులో నిందితుడికి (సూరిబాబు) ఆర్థిక సాయం అందించబడిన విషయం ప్రజల్లో అనుమానాలను రేకెత్తించింది. అదే సమయంలో గతంలో కేసులు ఎదుర్కొన్న ఆందోళనకారులపై చర్యలను ఉపసంహరించాలనే నిర్ణయం కూడా చర్చనీయాంశమైంది.

ఇప్పుడు తాజాగా ధ్వంసమైన రాముడి విగ్రహంతో పాటు సీతాదేవి, లక్ష్మణుడి పాత విగ్రహాలను ఏప్రిల్ 13న గోదావరి తీరంలో జలాధివాసం చేయాలని నిర్ణయం తీసుకోవడం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ నిర్ణయం నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని రాజకీయ వ్యాఖ్యలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బోడికొండ ఆలయ పరిణామాలు ఇకపై ఏ దిశగా సాగుతాయో చూడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment