---Advertisement---

స్టాండప్ కమెడియన్లపై వరస దాడులకి దిగుతున్న కూటమి పార్టీలు!

April 27, 2026

---Advertisement---

బెంగళూరులో (Bengaluru) జరిగిన స్టాండప్ కమెడియన్ (Stand-up Comedian) శరత్ ఉదయ్ (Sharath Uday) షోను టీడీపీ మద్దతుదారులు (TDP Supporters) అడ్డుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బెంగళూరులోని కోరమంగళలో ఉన్న ‘మినిస్ట్రీ ఆఫ్ కామెడీ’లో (Ministry of Comedy) హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ సోలో షో నిర్వహిస్తుండగా, టీడీపీ మద్దతుదారులు కొందరు వేదికపైకి వచ్చి అడ్డుకున్నారు. డిసెంబర్ 2024లో ఉదయ్ చేసిన “ఆంధ్ర పాలిటిక్స్” (Andhra Politics) అనే యూట్యూబ్ వీడియోలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఐటీ మంత్రి నారా లోకేష్‌పై (Nara Lokesh) చేసిన జోక్‌లను వారు ఇప్పుడు వ్యతిరేకిస్తూ దాడులకి దిగారు.

టీడీపీ నిరసనకారులు ఉదయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు, “జై టీడీపీ(Jai TDP)”, “జై లోకేష్ (Jai Lokesh)” అని నినాదాలు చేయమని ఒత్తిడి తెచ్చారు. ఉదయ్ దీనిని నిరాకరించినట్లు సమాచారం. అయితే ఆ జోక్‌లపై ఇప్పటికే 2024లోనే ఉదయ్ బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికీ, మళ్లీ షోను అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఉదయ్ మాట్లాడుతూ, తన 7 ఏళ్ల కెరీర్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారని, ఇది బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై వేదిక నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేసరికి నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే, వారిపై మాట్లాడే వారిపై దాడులకు తెగబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే జనసేన (Janasena) కార్యకర్తలు స్టాండప్ కమెడియన్ అనుదీప్ (Anudeep) షోపై దాడికి దిగిన ఘటన కూడా ఉంది. అలాగే హృదయ రాజన్ (Hriday Rajan) అనే మరో స్టాండప్ కమెడియన్‌పై కూడా ఇలాంటి దాడులు జరిగినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పటి ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై “జబర్దస్త్” వంటి కామెడీ షోలలో పవన్ కళ్యాణ్ మద్దతుదారులు స్కిట్లు వేసి డిఫేమ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థపై టార్గెట్ చేస్తూ సన్నివేశాలు చేర్చినట్లు కూడా విమర్శలు వచ్చాయి. అలాగే “బ్రో” అనే పవన్ కళ్యాణ్ సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పోలిన పాత్రను నటుడు పృథ్వీతో వేయించి హేళన చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

బెండపూడిలో అమెరికన్ యాక్సెంట్ మాట్లాడిన పేద విద్యార్థులను విపరీతంగా ట్రోల్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇళ్ల పట్టా వచ్చిందని చెప్పిన గీతాంజలిని ట్రోల్ చేసి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా వేధించారనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాండప్ కమెడియన్లపై వరుసగా దాడులు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. “వాళ్లు చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా? అదే వీరు మాత్రం అందరిపై హేళన చేస్తారా?” అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

1962 చైనా యుద్ధం నేపథ్యంలో, కార్టూనిస్ట్ లక్ష్మణ్ నెహ్రూ అలసత్వంపై వ్యంగ్యంగా గీసిన కార్టూన్‌ను చూసి, నెహ్రూ కోపపడకుండా, స్వయంగా లక్ష్మణ్‌కు ఫోన్ చేసి ప్రశంసించారని అంటారు. అలాంటి స్పూర్తి నేటి రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం–జనసేన నాయకుల్లో పూర్తిగా లోపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విధంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య విలువలు పతనమయ్యే ప్రమాదం ఉందని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని, తెలుగుదేశం–జనసేన అధినేతలు తమ కార్యకర్తలకు హితబోధ చేయాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో, ఈ తరహా దాడులు అధినేతల ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయనే అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment