విశాఖపట్నం విమానాశ్రయంలో (Visakhapatnam Airport) ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిపై, అత్యంత భద్రత ఉండే విమానాశ్రయంలో ప్రాణాపాయ దాడి జరిగితే, దానికి బాధ్యులైన వారిని పట్టుకోవడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి, కేసును తప్పుదోవ పట్టించేలా అడుగులు పడటం విచారకరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) (National Investigation Agency – NIA) వ్యవహరించిన తీరుపై జగన్ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిఐఎస్‌ఎఫ్ (CISF) వంటి పటిష్టమైన భద్రత ఉన్న విమానాశ్రయంలోకి నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు (Janipalli Srinivasa Rao) మారణాయుధం (కోడికత్తి)తో ఎలా ప్రవేశించాడో ఎన్‌ఐఏ స్పష్టం చేయలేదని అంటున్నారు. ఘటన జరిగిన మరుసటి రోజున నిందితుడి ఇంట్లో ఏరోడ్రోమ్ ఎంట్రీ పాస్ దొరికిందని, అంటే దాడి జరిగిన రోజున అతను ఎటువంటి పాస్ లేకుండానే లోపలికి వెళ్లాడని అర్థమవుతోందని పేర్కొంటున్నారు. దీనిపై భద్రతా అధికారులను ఎన్‌ఐఏ విచారించకపోవడం గమనార్హమని అంటున్నారు.
అలాగే నిందితుడి హాజరుకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు(Biometric Details), విమానాశ్రయ సీసీ కెమెరా దృశ్యాలను (Airport CCTV Footage) ఎన్‌ఐఏ లోతుగా విశ్లేషించలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఈ దాడి వెనుక భారీ కుట్ర ఉందనే అనుమానాలు మొదటి నుంచీ ఉన్నాయి. నిందితుడు(Accused) శ్రీనివాసరావు (Srinivasa Rao) గతంలో ఒక కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ, ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ లేకుండా విమానాశ్రయంలోని హోటల్‌లో ఉద్యోగం ఎలా పొందగలిగాడనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆ హోటల్ యజమాని అధికార పార్టీ తెలుగుదేశం (Telugu Desam Party) నాయకుడు కావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయని అంటున్నారు.
నిందితుడి బంధువులు కూడా అదే పార్టీలో క్రియాశీలకంగా ఉండటం, దాడికి ముందు అతను భారీగా డబ్బు ఖర్చు చేశాడనే ఆరోపణల నేపథ్యంలో, ఈ దాడి వెనుక ఉన్న ‘మాస్టర్‌మైండ్’(Mastermind) ఎవరో, మారణాయుదంతో సెక్యురిటీని దాటి విమానాశ్రయంలోకి నిందితుడు ఎలా వెళ్ళాడో తేలాల్సి ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు న్యాయం జరగాలని, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటపడాలని కోరుతుండగా, ఎన్‌ఐఏ మాత్రం తూతూ మంత్రంగా దర్యాప్తు ముగించి, హడావుడిగా చార్జ్‌షీట్ దాఖలు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) సేకరించిన కీలక సాక్ష్యాలను కూడా ఎన్‌ఐఏ పరిగణనలోకి తీసుకోలేదని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
మొత్తానికి, రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన నాయకుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో లోతైన విచారణ జరపాల్సింది పోయి, కేవలం పైపై దర్యాప్తుతో చేతులు దులుపుకోవడం, హత్యాయత్నాన్ని పలుచన చేసే విధంగా మీడియాలో ‘కోడికత్తి కేసు’ అంటూ చులకనగా ప్రస్తావించడం, జగన్ పైనే నిందలు వేస్తూ కేసును తప్పుదోవ పట్టించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థలు విచారణను వేగంగా పూర్తి చేయడమే కాకుండా, నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాస్వామ్య వాదులు అభిప్రాయపడుతున్నారు.







