ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై (Andhra Pradesh Assembly Elections) ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికలను “మిస్టరీ”(Mystery)గా అభివర్ణించారు. ముఖ్యంగా ఓటింగ్ శాతంపై (Voting Percentage) తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికల సంఘం ఇప్పటివరకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో భారీగా ఓటింగ్ నమోదైందని, అదనంగా 12 శాతం ఓట్లు ఎలా వచ్చాయనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. కొన్ని కేంద్రాల్లో 100 శాతం దాటేలా 132 శాతం వరకు పోలింగ్ నమోదవడం (Polling Recorded) ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సాధారణంగా సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగే పరిస్థితుల్లో, తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ కొనసాగిందని ఎన్నికల సంఘం చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకు క్యూలో నిలబడి ఓటు వేసిన వారి వివరాలు వెల్లడిస్తే తాను పాదపూజ చేస్తానని ఆయన సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.







