---Advertisement---

విశాఖపై కార్పొరేట్ కన్ను..? ఆదానీ-జిందాల్ నుంచి నగరాన్ని కాపాడాలన్న ఏబీ హెచ్చరిక!

May 2, 2026

---Advertisement---

విశాఖపట్నంపై (Visakhapatnam) కార్పొరేట్ సంస్థల (Corporate Companies) కన్ను పెరుగుతోందని, ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తం కావాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని (Vizag Steel Plant) కాపాడుకోవడం మాత్రమే కాకుండా, ఆదానీ (Adani Group), జిందాల్ (Jindal Group) వంటి సంస్థల నుంచి మొత్తం నగరాన్నే రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్ (RTC Complex) సమీపంలోని హోటల్ మేఘాలయలో తెలుగు శక్తి నిర్వహించిన మేధోమథనం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జిందాల్ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్‌పై స్వాధీనం కోసం ప్రయత్నిస్తోందని, అదే సమయంలో ఆదానీ గ్రూప్ నగరంలోని కీలక భూములపై కన్నేసిందని ఆయన ఆరోపించారు. చివరకు విశాఖ పోర్ట్‌పైనా ఆసక్తి పెరుగుతోందని చెప్పడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా బయటకు వచ్చి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో (North Andhra) సాగునీరు (Irrigation), రైతుల సమస్యలపై (Farmers Issues) తాను స్వయంగా అధ్యయనం చేస్తూ ప్రజలను కలుస్తున్నానని తెలిపారు. దేశం, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ నుంచి ఉత్తరాంధ్ర కూడా తప్పించుకోలేదని విమర్శించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రను గుర్తు చేస్తూ 1971లో శంకుస్థాపన నుంచి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఇది ప్రాంతీయ గర్వంగా నిలిచిందన్నారు. 32 మంది త్యాగాలతో సాధించిన ఈ కర్మాగారాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. నిర్వాసితులకు ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకపోవడం బాధాకరమని, ఇటీవల 600 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయం అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేవలం 10000 కోట్లు కేటాయిస్తే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయవచ్చని చెప్పారు. దశాబ్దాలుగా సాగుతున్న జంజావతి వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

భూముల కేటాయింపులపై (Land Allocations) కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎకరం భూమిని కేవలం 0.99 పైసలకే కేటాయిస్తున్నారని, ఇది తెరచాటు జరుగుతున్న పెద్ద బాగోతమని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కొందరికి మాత్రమే అప్పగించడం సరైన పద్ధతి కాదన్నారు. లూలు మాల్ వంటి ప్రాజెక్టుల్లో కూడా ఇదే విధానం కొనసాగుతోందని చెప్పారు.

డేటా సెంటర్ ప్రాజెక్టుల (Data Center Projects) పేరుతో భారీ రాయితీలు ఇస్తున్నప్పటికీ ఉద్యోగాలు మాత్రం తక్కువగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రోజుకు విశాఖ నగరం వినియోగించే విద్యుత్తుతో సమానంగా ఈ ప్రాజెక్టులు కరెంటును వినియోగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రతి ఏడాది 15 శాతం ప్రాపర్టీ టాక్స్ పెంపు మధ్య తరగతి ప్రజలపై భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, కార్మిక నాయకులపై కేసులు పెట్టడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి మేధావులు, ప్రజలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment