దశాబ్దాలుగా మీడియా రంగాన్ని గుప్పెట పట్టి, స్వంత వార్తా చానెల్స్ నడుపుతూ ప్రత్యర్థి పార్టీలపై వ్యతిరేక నేరేటివ్‌ను నిర్మిస్తూ, తద్వారా లాభం పొందుతూ రాజకీయాలు చేసిన పార్టీలకు తమిళనాడు ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ ఇప్పుడు ఒక కొత్త చర్చకు బీజం వేసినట్లైంది. మీడియా చానెల్స్ క్రమంగా ప్రజల్లో తమ విశ్వసనీయత కోల్పోయి పతనావస్థకు చేరాయా అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అలాగే ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియా కంటెంట్‌పై తమ నమ్మకాన్ని పెంచారా అనే చర్చ కూడా బలపడుతోంది.
తమిళనాట దశాబ్దాలుగా వేళ్లూరుకుపోయిన రెండు ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకేలకు తమ స్వంత శాటిలైట్ వార్తా చానెల్స్ ఉన్నాయి. డీఎంకేకు అనుకూలంగా సన్ న్యూస్, కలైంజర్ టీవీలు మద్దతుగా నిలవగా, అన్నా డీఎంకేకు జయా టీవీ, న్యూస్ జే మీడియా చానెల్స్ మద్దతుగా నిలిచాయి. ఇవి తమ ప్రత్యర్థి పార్టీలపై వ్యతిరేక కథనాలతో వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాయి. తమిళ ప్రజలు కూడా ఈ చానెల్స్ ప్రభావంతోనే తమ ఓటు నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఉంది. అయితే అది గతం.
మారిన కాలంలో ఇప్పుడు ఈ పార్టీల మీడియా చానెల్స్ ప్రజల్లో తమ విశ్వసనీయతను కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఆ ప్రభావమే తమిళనాట దశాబ్దాలుగా మీడియాను ఆధారంగా చేసుకుని అధికారాన్ని అనుభవించిన పార్టీలు తాజా ఎన్నికల్లో అధికారానికి దూరమయ్యేలా చేసింది. ఫలితంగా విజయ్ ఘన విజయం సాధించి, మెజారిటీ స్థానాలను దక్కించుకున్న పరిస్థితి ఏర్పడింది.
డీఎంకే, అన్నా డీఎంకేలకు ఉన్నట్లుగా విజయ్‌కు శాటిలైట్ మీడియా చానెల్స్ లేకపోయినా, ఆయనపై వ్యతిరేక ప్రచారం జరిగినప్పటికీ సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించడం గమనార్హం. ఈ పరిణామాలను విశ్లేషకులు పరిశీలిస్తూ, ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలకు వంతపాడే మీడియా చానెల్స్ విశ్వసనీయత కోల్పోయాయని, ఆ స్థానాన్ని సోషల్ మీడియా ఆక్రమించిందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో సోషల్ మీడియాను ఎవరు సమర్థవంతంగా వినియోగిస్తారో వారిదే ఆధిపత్యమని వారు చెబుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే చర్చ కొనసాగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్ వంటి చానెల్స్ మద్దతుగా నిలుస్తున్నప్పటికీ, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకుని ప్రతిపక్ష వైసీపీ ప్రజలకు తమ వాదనలను వివరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చానెల్స్ విశ్వసనీయత కోల్పోయిన నేపథ్యంలో, సోషల్ మీడియా ప్రభావం మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. తమిళనాట జరిగినట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా సోషల్ మీడియా కీలక పాత్ర పోషించే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా, నిస్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్న సమయంలో, ప్రజలు కూడా ప్రభావితమవకుండా నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఒక ప్రత్యామ్నాయ వేదికగా మారింది. దాని ఫలితంగా తమిళనాట ప్రధాన పార్టీలు పతనమై, విజయ్ ఘన విజయం సాధించారని విశ్లేషకులు భావిస్తున్నారు.






