తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Tamil Nadu Assembly Election Results) దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ, డీఎంకే పార్టీ(DMK Party) మరియు ఆ పార్టీ నాయకుడు ఎంకే స్టాలిన్‌కు (M. K. Stalin) తుది ఫలితాలు ఆశనిపాతంగా మారడం విశేషం. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు మరియు ముఖ్యంగా కుటుంబ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఈ ఫలితాలకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవడం కూడా ప్రజల్లో అసంతృప్తిని మరింత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలోనే ఓటమి చవిచూడటం రాజకీయంగా పెద్ద సంకేతంగా మారింది.
ఇక ఇదే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లోనూ (Andhra Pradesh) కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ముఖ్యంగా పరిపాలనలో ఏకపక్ష ధోరణులు, అంతర్గత విభేదాలు, అధికార కేంద్రీకరణ వంటి అంశాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. కీలక నాయకులపై పెరుగుతున్న విమర్శలు, సీనియర్ నాయకులకు దక్కని ప్రాధాన్యత, స్థానిక నాయకత్వాన్ని పక్కనపెట్టే నిర్ణయాలు పార్టీ అంతర్గత అసంతృప్తిని బయటపెడుతున్నాయి.
అలాగే కూటమి పార్టీలైన తెలుగుదేశం (Telugu Desam Party), జనసేన(Jana Sena Party), బీజేపీ (Bharatiya Janata Party)ల మధ్య సమన్వయం లోపించడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక స్థాయిలో కార్యకర్తల మధ్య ఘర్షణలు, ఆధిపత్య పోరు, నామినేటెడ్ పోస్ట్లు పంపకాలపై భిన్నాభిప్రాయాలు కూటమి ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకుల జోక్యం పెరిగిపోవడం, పరిపాలనలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి.
ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాల విషయంలో కూడా ప్రజల్లో నిరాశ నెలకొంది. పెన్షన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా వంటి పథకాల అమలులో లోపాలు ఉన్నాయని, కొన్ని పథకాలలో కోతలు పెట్టడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు సరైన మద్దతు లేకపోవడం, ఎరువుల కొరత వంటి సమస్యలు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతున్నాయి.
ఈ మొత్తం పరిస్థితులను పరిశీలిస్తే, తమిళనాడులో డీఎంకే పార్టీకి తగిలిన దెబ్బ ఒక రాజకీయ హెచ్చరికగా భావించవచ్చు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రజా అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో, అధికార కూటమి ఈ సంకేతాలను గమనించకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాగే మరికొందరు మాత్రం రెడ్ బుక్ పాలన , సామాన్యులపై వేదింపులు వెరసి ప్రభుత్వానికి ఏదురు దెబ్బ తగిలే పరిస్థితులు ఇప్పటికే ఏర్పడ్డాయని, ఈ లోపాలను సరిచేసుకునే స్థాయి కూడా దాటిపోయిందని అభిప్రాయ పడుతున్నారు.






