జావా ఫిలింస్ అనే యూట్యూబ్ ఛానల్ రూపొందించిన ఎర్రచందనం డాక్యుమెంటరీలో ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) ను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలు బట్టబయలయ్యాయి. జావా డిస్కవరీ (Java Discovery) ఛానల్లో తప్పుడు కథనాలు కుట్రపూరితంగానే ప్రసారమయ్యాయని తెలుస్తోంది. ‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీని మార్చి, వక్రీకరించి జావా డిస్కవరీ ప్రసారం చేసిందని ఆరోపణలు వెలువడుతున్నాయి.
2021లో ‘బ్లడ్ శాండర్స్’(Blood Sandalwood) పేరుతో సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి (Udumula Sudhakar Reddy) ఒక పుస్తకం రచించారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్ కిల్లర్స్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించబడింది. 2023-24లో అది అమెజాన్ ప్రైమ్ మరియు అల్ జజీరా వంటి వేదికల్లో విడుదలైంది. ఆ డాక్యుమెంటరీ అసలు వెర్షన్లో ఏ రాజకీయ నాయకుడి ప్రస్తావన లేదు.
ఈ నేపథ్యంలో, తాను చెప్పని, తన పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీ కొత్తగా చేర్చడంపై ఉడుముల సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థపై లీగల్ చర్యలు తీసుకుంటానని ఆయన ట్వీట్ చేశారు.
‘ప్లానెట్ కిల్లర్స్’ డాక్యుమెంటరీ (‘Planet Killers’ Documentary) వెనుక ఏపీలోనే కొందరు ప్రముఖులు భారీ స్థాయిలో కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అసలు రచయిత డాక్యుమెంటరీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది.
కేవలం ప్రతిపక్ష నాయకుడు జగన్పై అసత్య ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే జావా ఫిలింస్ సంస్థను ప్రభావితం చేసి, పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీలో ప్రసారం చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ప్రసారాన్ని ఆధారంగా తీసుకుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ(TDP) జగన్పై బురద జల్లే ప్రయత్నం చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






