పశ్చిమ బెంగాల్లో (West Bengal) మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. బీజేపీ(BJP) కీలక నేత సువేందు అధికారి(Suvendu Adhikari) వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ను (Chandranath) మధ్యమ్గ్రామ్ ప్రాంతంలో దుండగులు కాల్చిచంపిన ఘటన సంచలనంగా మారింది. ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డగించి నలుగురు రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడిలో చంద్రనాథ్ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయంగా పెరిగిన వేడి
ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఘటనాస్థలాన్ని సువేందు అధికారి స్వయంగా పరిశీలించగా, ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని ఆరోపించారు. తన పీఏ(PA)హత్య వెనుక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మేనల్లుడి హస్తం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
హత్యపై సీబీఐ విచారణ డిమాండ్
మరోవైపు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(All India Trinamool Congress) ఈ ఘటనను ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని పేర్కొంది. దోషులను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే సీబీఐ(CBI) విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస మళ్లీ చర్చనీయాంశంగా మారింది.






