రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక జిల్లా కలెక్టర్ల సదస్సు నేటి నుంచి సచివాలయం వేదికగా ప్రారంభమైంది. ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న ఈ సమావేశంలో జిల్లాల అభివృద్ధి, పాలనా వ్యవస్థ, ప్రభుత్వ పథకాల అమలు, పరిపాలనా సామర్థ్యం వంటి కీలక అంశాలపై సమగ్ర చర్చ జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల పనితీరును ‘కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్’ (Key Performance Indicators) ఆధారంగా విశ్లేషించి ప్రభుత్వం ప్రత్యేక ర్యాంకులను (Special Rankings) ప్రకటించడం ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా మారింది.
ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో మొత్తం 18 శాఖలు 90 శాతానికి పైగా మార్కులు సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచినట్లు వెల్లడించారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ 100కు 100 పాయింట్లు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం విశేషం అంటూ ప్రకటించారు. పథకాల అమలు, లక్ష్యాల సాధన, సేవల పారదర్శకత వంటి అంశాల్లో ఆ శాఖ అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యవేక్షిస్తున్న అటవీ, పర్యావరణ శాఖ పనితీరు. ఈ శాఖ కేవలం 67 పాయింట్లు మాత్రమే సాధించి ర్యాంకింగ్స్‌లో (Rankings) చివరి స్థానానికి (Last Position) చేరినట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు, అభివృద్ధి లక్ష్యాల అమలు వంటి అంశాల్లో శాఖ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయిందని నివేదిక సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని శాఖకు చివరి ర్యాంక్ రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాలనలో మార్పులు, పనితీరు మెరుగుదల కోసం ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన శాఖల్లో సమీక్షలు, కొత్త విధానాలు, బాధ్యతల పునర్విభజన వంటి చర్యలు ఉండవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.






