---Advertisement---

కూటమి పాలనలో పెరిగిన హింసాత్మక నేరాలు.. ఎన్‌సీఆర్‌బీ నివేదికలో స్పష్టం .. రెడ్ బుక్ పరిపాలనే కారణమా?

May 8, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, తాజాగా విడుదలైన ఎన్‌సీఆర్‌బీ (NCRB) (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) 2024 వార్షిక నివేదిక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా హింసాత్మక నేరాలు(Violent Crimes), మహిళలపై దాడులు(Attacks on Women), మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసులు గణనీయంగా పెరిగినట్లు నివేదిక స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాజిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

నివేదిక ప్రకారం తీవ్ర గాయాలకు దారితీసే దాడులు, హింసాత్మక నేరాల సంఖ్య 2022లో 7,104గా ఉండగా, 2023లో 6,492కు తగ్గింది. అయితే 2024లో మాత్రం ఆ సంఖ్య ఒక్కసారిగా 27,443కు పెరగడం రాష్ట్రంలో పరిస్థితుల తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ఈ పెరుగుదలకు 2024 ఎన్నికల అనంతరం రాజకీయ కక్షసాధింపులే ప్రధాన కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నాయకులు, కార్యకర్తలపై కూటమి వర్గాలు జరిపిన దాడులు, బెదిరింపులు, “రెడ్ బుక్ రాజ్యాంగం”(“Red Book Constitution”) పేరుతో సాగుతున్న చర్యలు ఈ గణాంకాల పెరుగుదలకి కారణమని విమర్శకులు పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో మహిళల భద్రత పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం తీవ్ర చర్చకు దారితీసింది. మహిళా రాజకీయ నాయకులపై కూడా బహిరంగ దాడులు జరగడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలు పెరిగాయని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పల హారికపై జరిగిన దాడి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవశీధర్ బాధితురాలిపై జరిగిన దాడి, పిఠాపురం, తుని ప్రాంతాల్లో మైనర్ బాలికలపై టీడీపీ(TDP) చోటా నాయకులు జరిపిన అత్యాచార ఘటనలు, జనసేన (Janasena) నేత కిరణ్ రాయల్‌పై (Kiran Royal) వచ్చిన ఆరోపణలు రాష్ట్ర మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక రాష్ట్రంలో మద్యం వినియోగం పెరగడం కూడా నేరాల పెరుగుదలకు కారణమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మద్యం ప్రభావంతో మహిళలపై అసభ్య ప్రవర్తన, వేధింపులు, రోడ్లపై అల్లర్లు పెరిగాయని సామాజిక సంస్థలు చెబుతున్నాయి.

అయితే మరోవైపు మొత్తం నమోదైన కేసుల సంఖ్య తగ్గిందని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి. ఐపీసీ, ప్రత్యేక స్థానిక చట్టాల కింద 2022లో 1,95,284 కేసులు, 2023లో 1,84,293 కేసులు నమోదు కాగా, 2024లో అవి 1,68,788కు తగ్గాయి. కానీ ఇందులో ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులు తగ్గిపోవడం, అదే సమయంలో హింసాత్మక నేరాలు పెరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు కేసులు నమోదు చేయకుండా వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇదే సమయంలో మానవ అక్రమ రవాణా అంశం రాష్ట్ర ప్రతిష్ఠను మరింత దెబ్బతీసేలా కనిపిస్తోంది. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో 313 మంది మానవ అక్రమ రవాణాకు గురైనట్లు నమోదైంది. మొత్తం 159 కేసులు నమోదు కాగా, బాధితుల్లో 291 మంది మహిళలు, బాలికలే కావడం కలవరపెడుతోంది. వారిలో 279 మంది లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణాకు గురైనట్లు “హెల్ప్” స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎన్. రామ్ మోహన్ వెల్లడించారు.

ఈ అంశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తిరిగి చర్చకు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వేలాది మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారని ఆయన ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు కేంద్ర గణాంకాల్లో స్పష్టమైన ఆధారాలు లభించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే మహిళల అక్రమ రవాణా కేసులు పెరగడం, మహిళల భద్రతపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా నియంత్రణ, రెడ్ బుక్ పేరుతో జరుగుతున్న రాజకీయ హింస అరికట్టడం వంటి అంశాలపై అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక సంస్థలు, మహిళా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రాష్ట్రంలో నేరాల పెరుగుదల మరింత ప్రమాదకర దిశగా వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment