దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు (Students) కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎంతో కీలకంగా భావించిన నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షను అధికారికంగా రద్దు (Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. మే 3న నిర్వహించిన ఈ పరీక్షలో రాజస్థాన్‌లో పేపర్ లీక్ (Paper Leak) జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షపై వచ్చిన వివాదం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ‘గెస్ పేపర్’ (Guess Paper) ముందుగానే బయటకు వచ్చిందనే వార్తలు రాజస్థాన్‌లో తీవ్ర కలకలం రేపాయి. ఈ అంశంపై దర్యాప్తు సంస్థలు సమర్పించిన ప్రాథమిక నివేదికలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు సమాచారం.
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ పేపర్ లీక్ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు కేసును సీబీఐ (CBI)కి అప్పగించారు. ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు పలువురిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
రద్దు చేసిన పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ(NTA) ప్రకటించింది. అయితే కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న వివరాల ఆధారంగానే రీ-ఎగ్జామ్‌కు అనుమతిస్తామని తెలిపారు.
అలాగే, పాత హాల్‌టికెట్ల ఆధారంగా లేదా కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేసి పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని కూడా ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
ఇక పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్ర నిరాశ, ఆందోళనకు గురవుతున్నారు. నెలల తరబడి కష్టపడి సిద్ధమైన అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం మానసిక ఒత్తిడిని పెంచుతోంది. అయినప్పటికీ అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా పరీక్ష నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
విద్యార్థులు, తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అధికారులు సూచించారు. పరీక్షకు సంబంధించిన ప్రతి అధికారిక సమాచారం ఎన్‌టీఏ వెబ్‌సైట్ ద్వారానే విడుదల అవుతుందని స్పష్టం చేశారు.
In continuation of its press release dated 10 May 2026, the National Testing Agency wishes to inform candidates, parents, and members of the public of the following decisions taken in respect of NEET (UG) 2026. NTA had, on 8 May 2026, referred the matters then under consideration…
— National Testing Agency (@NTA_Exams) May 12, 2026






