తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిరోజూ భక్తుల సౌకర్యార్థం విడుదల చేస్తున్న శ్రీవాణి టికెట్లు ఇప్పుడు అక్రమాల కేంద్రంగా మారుతున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణ భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందేందుకు పోరాడుతుండగా, కొందరు ట్రావెల్ ఏజెన్సీలు మాత్రం భారీ సంఖ్యలో టికెట్లు సొంతం చేసుకుని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
టీటీడీ విజిలెన్స్ నిర్వహించిన తనిఖీల్లో చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్స్ సంస్థ ఒకే ఫోన్ నంబర్ ద్వారా పెద్దఎత్తున శ్రీవాణి టికెట్లు పొందుతున్నట్టు గుర్తించారు. అసలు ధర రూ.10,500 ఉన్న టికెట్‌ను రూ.13,500కు విక్రయిస్తూ భక్తులను మోసం చేస్తున్నట్టు ఆధారాలు బయటపడ్డాయి. తనిఖీల్లో భక్తులు ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులకు భారీ మొత్తాలను ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసినట్లు గుర్తించారు. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.
ప్రస్తుతం టీటీడీ ప్రతిరోజూ 1,500 శ్రీవాణి టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 టికెట్లు ముందస్తుగా విదేశీ భక్తులకు, 800 టికెట్లు ప్రతిరోజూ ఉదయం ఆన్‌లైన్ ద్వారా, మరో 200 టికెట్లు తిరుపతి విమానాశ్రయంలో విమాన ప్రయాణికులకు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ సాధారణ భక్తులకు టికెట్లు అందకపోవడం, కొన్ని సెకన్లలోనే కోటా పూర్తవుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టీటీడీ పారదర్శకత కోసం నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ, కొందరు టెక్నాలజీ సహాయంతో అక్రమాలకు పాల్పడుతున్నారని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒకే నంబర్ ద్వారా భారీగా టికెట్లు బుక్ అవుతున్న వ్యవహారం వెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇప్పటికే తిరుమలలో పరిపాలనా వైఫల్యాలపై భక్తుల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో ఈ ఘటన మరింత ఆవేదనకు గురిచేస్తోంది. తొక్కిసలాట ఘటనలు, గోవుల మరణాలు, లడ్డూపై వివాదాలు, అన్నప్రసాదంలో పరిశుభ్రత సమస్యలు, మాడవీధుల్లో మద్యం మత్తులో వ్యక్తుల వీరంగం వంటి ఘటనలతో తిరుమల పవిత్రత దెబ్బతింటోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శ్రీవాణి టికెట్లు కూడా బ్లాక్ మార్కెట్‌కు చేరడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పలువురు ధార్మికవేత్తలు వాపోతున్నారు.






