ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్మాణాల నాణ్యతపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు వంగిపోవడం, హంద్రీ–నీవా ప్రాజెక్టులో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పగిలిపోవడం, సింహాచలంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి భక్తులు ప్రాణాలు కోల్పోవడం వంటి వరుస ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఘటనలన్నీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలతో సంబంధం ఉండటంతో విమర్శలు మరింత తీవ్రమవుతున్నాయి.
అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌లో పనులు పూర్తికాకముందే తాజాగ స్టీల్ గడ్డర్లు వంగిపోవడం నిర్మాణ నాణ్యతపై అనుమానాలు రేకెత్తించింది. భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇంజినీరింగ్ ప్రమాణాలు, మెటీరియల్ నాణ్యత, పర్యవేక్షణ వ్యవస్థలపై సరైన నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దీనిని చిన్న సాంకేతిక సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, “పూర్తికాకముందే ఇలా ఉంటే పూర్తయ్యాక పరిస్థితి ఎలా ఉంటుంది?” అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో కూడా భారీ నాణ్యతా లోపాలు గడిచిన నెలలోనే వెలుగులోకి వచ్చాయి. పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను అభివృద్ధి చిహ్నాలుగా ప్రచారం చేసినప్పటికీ, ఇప్పుడు కాలువల లైనింగ్ పనులు నీరు వదిలిన వెంటనే పగిలిపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నిబంధనలకు విరుద్ధంగా మట్టి పొరలపైనా నాసిరకం షార్ట్‌క్రీటింగ్ చేయడంతో కాలువలు దెబ్బతిన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందనే విమర్శలతో పాటు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
సింహాచలం చంద్రోత్సవాల సమయంలో జరిగిన గోడ ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటన సాధారణ ప్రమాదం కాదని, నిర్మాణ నాణ్యతలో లోపాలు మరియు అధికారుల నిర్లక్ష్య ఫలితమేనని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ప్రమాద సూచనలు ఉన్నప్పటికీ శాశ్వత చర్యలు తీసుకోలేదని అంటున్నారు.
అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా ప్రచారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన అనేక భవనాల్లో గతంలోనే లోపాలు బయటపడ్డాయి. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో చిన్న వర్షానికే నీరు కారడం, స్లాబులు ఊడిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాత్కాలిక హైకోర్టు భవనం కూడా వర్షపు నీటితో నిండిపోవడంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. “ప్రపంచస్థాయి నిర్మాణాలు” అంటూ ప్రచారం చేసిన ప్రాజెక్టుల అసలు నాణ్యత ఇదేనా అనే ప్రశ్నలు అప్పుడే తలెత్తాయి.
2014–2019 మధ్యకాలంలో కూడా అనేక నిర్మాణ వైఫల్యాలు నమోదయ్యాయి. ముచ్చుమర్రి రెగ్యులేటర్ ప్రారంభించిన మరుసటి రోజే కూలిపోవడం, పట్టిసీమ అక్విడెక్ట్ జాయింట్లు విరిగిపోవడం, పోలవరం కుడి కాలవ వింగ్‌వాల్ కూలిపోవడం, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో పైపులైన్లు పగిలిపోవడం, విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ దశలోనే స్తంభం కూలిపోవడం వంటి ఘటనలు తీవ్ర చర్చకు దారి తీశాయి. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయపడటం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది.
ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటే ప్రజలు భద్రత, నాణ్యత, దీర్ఘకాల ప్రయోజనం ఆశిస్తారు. కానీ వరుసగా బయటపడుతున్న లోపాలు ప్రజల్లో అనుమానాలు పెంచుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రాజెక్టుల రూపకల్పన నుంచి అమలు వరకు రాజకీయ ప్రచారం జోక్యం పెరగడం, టెండర్లలో పారదర్శకత లేకపోవడం, పర్యవేక్షణ బలహీనపడటం వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. ప్రజల ప్రాణాలు, ప్రజాధనం, దీర్ఘకాల మౌలిక సదుపాయాల భద్రత కంటే ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రమాదకరమనే అభిప్రాయం బలపడుతోంది.
అమరావతి స్టీల్ బ్రిడ్జ్ నుంచి హంద్రీ–నీవా కాలువలు, సింహాచలం గోడ ఘటన నుంచి పోలవరం వరకు వరుసగా బయటపడుతున్న లోపాలు ఇప్పుడు ఒక కొత్త చర్చను తెరమీదకు తెస్తున్నాయి — ప్రభుత్వ నిర్మాణాల్లో నిజంగా నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చారా? ప్రజల నమ్మకానికి ప్రతీకలుగా ఉండాల్సిన ప్రభుత్వ నిర్మాణాలు, ప్రతి ఘటనతో అనుమానాలకు కేంద్రబిందువుగా మారడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.






