ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యా వ్యవస్థలో (Education System) మూల్యాంకన ప్రక్రియపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది పదో తరగతి ఫలితాల సమయంలో బయటపడిన లోపాలు ఇంకా మరవకముందే, ఇప్పుడు ఇంటర్మీడియట్(Intermediate) ఫలితాల్లో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని బోటనీ సబ్జెక్ట్‌లో (Botany Subject) మొదట ఫెయిల్‌గా ప్రకటించి, రీవాల్యుయేషన్ (Revaluation) తర్వాత ఏకంగా 60కు 60 మార్కులు రావడం విద్యాశాఖ (Education Department) పనితీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్య (Karlapudi Kavya) ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. ఏప్రిల్ 15న విడుదలైన ఫలితాల్లో ఆమెకు దాదాపు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చినప్పటికీ, బోటనీలో కేవలం 5 మార్కులు మాత్రమే రావడంతో ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. తాను పరీక్ష బాగా రాశానన్న నమ్మకంతో కావ్య వెంటనే రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేశారు.
అయితే రీవాల్యుయేషన్ ఫలితాలు వెలువడిన తర్వాత అసలు నిజం బయటపడింది. బోటనీ సబ్జెక్ట్‌లో ఆమెకు ఏకంగా 60కు 60 మార్కులు వచ్చినట్లు వెల్లడైంది. ఆన్సర్ షీట్ పరిశీలనలో ప్రతి ప్రశ్నకు పూర్తి మార్కులు నమోదై ఉండగా, ఓఎంఆర్ షీట్‌లో కూడా 60 మార్కులే నమోదు చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఒకవేళ ఆ విద్యార్థిని ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటే పరిస్థితి ఏంటి?” అంటూ ప్రశ్నిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో ఇలాంటి నిర్లక్ష్యం ఎలా చోటుచేసుకుంటోందని నిలదీస్తున్నారు.
విద్యావేత్తలు కూడా ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళం నుంచి విద్యాశాఖ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యారంగం పూర్తిగా గాడితప్పిందని, విద్యార్థుల భవిష్యత్తును సైతం నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
పరీక్షలు రాసేందుకు విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే, ఫలితాల ప్రకటనలో జరిగే నిర్లక్ష్యాలు వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం, అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) నాయకత్వంలోని వ్యవస్థపై ఇప్పుడు ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రిలో అనుమానాలు పెరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.






