---Advertisement---

CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన సీఎం విజయ్.. పూర్తి మంత్రివర్గ జాబితా ఇదే.

May 16, 2026

---Advertisement---

తమిళనాడులో (Tamil Nadu) కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలుకుతూ సీఎం(CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శనివారం కొత్త కేబినెట్‌కు (New Cabinet) శాఖల కేటాయింపులు పూర్తి కాగా, ముఖ్యమైన హోం(Home Department), పోలీస్(Police Department), మహిళా-శిశు సంక్షేమ శాఖలను (Women & Child Welfare Departments) సీఎం విజయ్ తన వద్దే ఉంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పరిపాలనపై పూర్తి పట్టు సాధించే దిశగా విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీఎం విజయ్ తన వద్ద మొత్తం 11 కీలక శాఖలను ఉంచుకున్నారు. ప్రజా పరిపాలన, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక కార్యక్రమాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, బాలల సంక్షేమం, వృద్ధులు-దివ్యాంగుల సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా వంటి విభాగాలన్నీ ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండనున్నాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగంపై పూర్తి నియంత్రణ సాధించే ప్రయత్నంగా దీనిని చూస్తున్నారు.

అన్నాడీఎంకే నుంచి టీవీకేలో(TVK) చేరిన సీనియర్ నేత సెంగొట్టయ్యన్‌కు (Sengottaiyan) ఆర్థిక శాఖ కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనుభవజ్ఞుడైన నేతకు ఫైనాన్స్ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో విజయ్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ కేబినెట్‌లో అతి పిన్న వయస్కురాలైన ఎస్ కీర్తనకు (S. Keerthana) పరిశ్రమల శాఖ దక్కడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పరిశ్రమలతో పాటు పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించారు. యువ మహిళా నేతకు ఇంత కీలకమైన శాఖ ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా టీవీకే వర్గాలు చెబుతున్నాయి.

ఎన్ ఆనంద్‌కు (N. Anand) గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు వంటి కీలక అంశాలు ఆయన పరిధిలోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనున్న సంకేతాలు ఇవి.

టీవీకేలో మరో కీలక నేత అదవ్ అర్జునకు (Adhav Arjun) పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖలు అప్పగించారు. రహదారులు, భవనాలు, చిన్న ఓడరేవుల అభివృద్ధి బాధ్యతలను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు. మౌలిక సదుపాయాల విస్తరణలో ఈ శాఖ కీలక పాత్ర పోషించనుంది.

డాక్టర్ కేజీ అరణ్ రాజ్‌కు (Dr. KG Aran Raj) ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పి వెంటకరమణన్‌కు ఆహార, పౌర సరఫరాల శాఖలు దక్కాయి.

ఆర్ నిర్మల్ కుమార్‌కు (R. Nirmal Kumar) ఇంధన వనరులు, విద్యుత్, కోర్టులు, జైళ్లు, అవినీతి నిరోధక శాఖలు కేటాయించారు. రాజ్‌మోహన్‌కు పాఠశాల విద్య, తమిళ అభివృద్ధి, సమాచార మరియు ప్రచార శాఖలు అప్పగించారు. సినిమాటోగ్రఫీ శాఖను కూడా ఆయనే నిర్వహించనున్నారు.

డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరులు, ఖనిజాలు, గనుల శాఖల బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర సహజ సంపద వినియోగం, గనుల నిర్వహణలో ఈ శాఖ కీలకంగా ఉండనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment