---Advertisement---

ఆర్టీసీకి ముగింపు పలుకుతున్నారా?.. కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న అనుమానాలు!

May 17, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ బస్సుల విధానాన్ని అమలు చేస్తున్న తీరుపై తీవ్ర రాజకీయ, సామాజిక చర్చ మొదలైంది. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు, పౌరహక్కుల వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టడాన్ని ఆధునికీకరణగా చెబుతున్నప్పటికీ, వాటి నిర్వహణను ఆర్టీసీ చేత కాకుండా కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని తీసుకున్న నిర్ణయం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగుల సంఖ్య తగ్గించే అవకాశాలపై ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు కూడా ఆందోళనకు కారణమయ్యాయి. గత ఏడాది నవంబరులో సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు పరోక్షంగా రంగం సిద్ధం చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చరిత్రను పరిశీలిస్తే, 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం పదవి వీడే సమయానికి ఆర్టీసీ 187 కొట్ల లాభాల్లో ఉండగా, 2004లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి భారీ నష్టాల్లోకి వెళ్లిందని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన వాల్వో బస్సులను కూడా సక్రమంగా నిర్వహించలేక ప్రైవేట్ సంస్థలకు అప్పగించాల్సి వచ్చిందని ఆర్టీసీ వర్గాలు ఇప్పటికీ ప్రస్తావిస్తుంటాయి.

2001లో చంద్రబాబు పాలనలో ఆర్టీసీ ఉద్యోగులు 24 రోజులపాటు సమ్మె నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాంక్ ఒప్పందాల్లో భాగంగా ప్రైవేటీకరణ జాబితాలో ఆర్టీసీని చేర్చడం, ఉద్యోగుల కోతకు కమిటీలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు కార్మిక వర్గాల్లో నాడే తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి.

అయితే 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీకి ఊరట లభించిందని, సంస్థ మళ్లీ లాభాల బాట పట్టిందని చెబుతారు. అనంతరం రాష్ట్ర విభజన, ఆర్థిక ఇబ్బందులు, విధాన పరమైన అస్థిరతల కారణంగా ఆర్టీసీ మళ్లీ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శలు వచ్చాయి.

2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు 52 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వారికి జీతాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు ప్రభుత్వ నిధులతోనే అందేలా చర్యలు చేపట్టారు. 2020 జనవరి 1 నుంచి విలీనం అమల్లోకి రావడంతో ప్రతి నెలా జీతాల కోసం ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించింది. అప్పటివరకు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి పూర్తిగా మారిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.

అదే సమయంలో వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి ఉపశమనం కలిగించేలా అప్పుల చెల్లింపులు జరిపినట్లు, కొత్త బస్సులు కొనుగోలు చేసి పాత బస్సులను రీమోడలింగ్ చేసినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ కాలాన్ని ఆర్టీసీ ఉద్యోగులు “స్వర్ణయుగం”గా అభివర్ణిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇప్పుడు మళ్లీ ఆర్టీసీని “ఆర్థిక భారం” పేరుతో ప్రైవేట్ చేతుల్లోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం భారం కాదని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు అదే కారణంగా కొత్త బస్సుల కొనుగోలు ఆర్థికంగా కష్టమని పేర్కొనడం ద్వంద్వ వైఖరికి ఉదాహరణ కాదా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు, కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూములు, ఆస్తులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లేలా పథకం అమలు జరుగుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో, ఆర్టీసీ భవిష్యత్తును కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి నెట్టే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి, కార్మిక హక్కులకు ప్రమాదకరమని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment