భారతదేశంలో పిల్లలను పెంచడం ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రోజురోజుకూ భారంగా మారుతోంది. ఒకప్పుడు పిల్లల పెంపకం అనేది కుటుంబ బాధ్యతగా భావించబడితే, ఇప్పుడు అది భారీ ఆర్థిక ప్రాజెక్ట్‌లా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖరీదైన విద్య, ప్రైవేట్ వైద్య వ్యవస్థ, జీవనశైలి ఒత్తిడులు, ఉద్యోగాల్లో స్థిరత్వం లేకపోవడం వంటి కారణాలు కలిసి కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి.
కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ పరిస్థితి మరింత దిగజారిందని పలు ఆర్థిక సర్వేలు సూచిస్తున్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు, ట్యూషన్లు, వైద్య ఖర్చులు, పోషకాహారం, డిజిటల్ విద్య కోసం అవసరమయ్యే గ్యాడ్జెట్లు—ఇవన్నీ కలిపి ఒక సాధారణ కుటుంబం నెలవారీ ఆదాయంలో సింహ భాగాన్ని తీసుకుంటున్నాయి. మరోవైపు జీతాల పెరుగుదల మాత్రం అదే స్థాయిలో లేకపోవడం వల్ల కుటుంబాలు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రత్యేకంగా ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు తర్వాత వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, “బై నౌ పే లేటర్” విధానాల ఈఎంఐలు పెరిగాయి. దీంతో ఇప్పటికే అప్పుల్లో ఉన్న కుటుంబాలు మరింత ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నాయి. చాలా కుటుంబాలు ఇప్పుడు అవసరాల కోసం కూడా రుణాలు తీసుకునే పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. ఈ పరిస్థితి కేవలం ఆర్థిక సమస్యగానే కాకుండా మానసిక ఆరోగ్య సమస్యగా కూడా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుల ఒత్తిడి వల్ల తల్లిదండ్రుల్లో ఆందోళన, నిద్రలేమి, మానసిక అలసట వంటి సమస్యలు పెరుగుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ “ఎంతమందికి వీలైతే అంతమందిని కనాలి” అని పిలుపునిచ్చిన ఆయన, మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు ప్రభుత్వ పరంగా ఇస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ఒకసారి ఇచ్చే రూ.30 వేలు లేదా రూ.40 వేలు పిల్లల జీవితాంతపు ఖర్చులతో పోలిస్తే చాలా తక్కువ మొత్తం. పిల్లల విద్య, ఆరోగ్యం, పోషణ, భవిష్యత్ ఉపాధి అవకాశాలు అన్నీ కలిపితే పిల్లవాడికి 21 ఏళ్ళు వచ్చేసరికి కొట్లు ఖర్చుగా మారుతుందని. అలాంటప్పుడు తాత్కాలిక ప్రోత్సాహక నగదు పేరుతో కుటుంబాలను మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. మరో పక్క ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన “సూపర్ సిక్స్” వంటి హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, మరోవైపు ఖజానా ఖాళీగా ఉందని ప్రభుత్వం చెబుతుండటం, అదే సమయంలో పిల్లలు కనండి – పైకం ఇస్తామని ప్రకటించడం విరుద్ధ ధోరణిగా కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు.
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేవలం నగదు ప్రోత్సాహకాల కంటే మెరుగైన ప్రభుత్వ విద్య, ఉచిత వైద్యం, మహిళలకు ఉపాధి భద్రత, పిల్లల పోషణకు దీర్ఘకాలిక మద్దతు వంటి వ్యవస్థలు ఉంటేనే కుటుంబాలు ధైర్యంగా ఎక్కువ మంది పిల్లలను కనడానికి ముందుకు వస్తాయని అంటున్నారు. సామాజిక విశ్లేషకులు సైతం ఎంతమంది పిల్లలు ఉండాలి అనేది పూర్తిగా కుటుంబాల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాలు, వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడాలని. ప్రభుత్వాలు ఆర్థిక సహాయం పేరుతో భావోద్వేగ నిర్ణయాలను ప్రభావితం చేయకుండా, కుటుంబాల జీవన నాణ్యతను మెరుగుపరచే విధానాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ అనిశ్చితి, అప్పుల ఒత్తిడి వంటి పరిస్థితుల్లో పిల్లల పెంపకం ఇప్పటికే ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో “పిల్లలు కనండి – నగదు ఇస్తాం” అనే రాజకీయ ప్రకటనలు సమాజంలో చర్చకు దారితీస్తున్నాయి. తాత్కాలిక ప్రోత్సాహకాల కంటే దీర్ఘకాలిక సంక్షేమ విధానాలే ప్రజలకు నిజమైన భరోసా ఇస్తాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.






