గుంటూరులో (Guntur) పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ నేతలు భారీ ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) రిక్షా Rickshaw) తొక్కుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. ఇదేనా సంపద సృష్టి.. ఇదేనా సుపరిపాలన అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో రాష్ట్ర పన్నులు తగ్గించి ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్(Nara Lokesh) ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని అంబటి రాంబాబు విమర్శించారు. “లోకేష్ కాదు.. ఆయన పేరు లవ్ క్యాష్”(Love Cash) అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులపైనే ప్రభుత్వ దృష్టి ఉందని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలకు, ప్రస్తుతం చేస్తున్న పనులకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఆర్టీసీతో(RTC) పాటు మెడికల్ కాలేజీలను (Medical Colleges) కూడా ప్రైవేటీకరణ (Privatization) చేస్తున్నారని ఆరోపించిన అంబటి, వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రజలపై భారాలు మోపుతూ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.
“రెడ్ బుక్” (Red Book) అంశంపైనా అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. “రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన (Jana Sena Party) నేతలపై కూడా అమలు చేస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. ముట్లూరు ఘర్షణ ఘటనలో జనసేన కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారని, అయితే టిడిపికి చెందిన కల్యాణ్ చక్రవర్తిపై నమోదైన కేసులను మాత్రం మాఫీ చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
అధికార మదంతో తమను గెలిపించిన వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించిన అంబటి, రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు పెరుగుతోందన్నారు. జనాభా పెంపుపై ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపైనా స్పందించిన ఆయన, పిల్లలను కనాలని చెప్పే నైతిక హక్కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Nara Chandrababu Naidu) లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.






