---Advertisement---

ఉయ్యాలవాడ ఎయిర్‌పోర్ట్‌పై కూటమి కన్ను.. అభివృద్ధి పేరుతో ప్రైవేట్ చేతుల్లోకా?

May 18, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మరో కీలక ప్రభుత్వ ఆస్తి (Government Asset) ప్రైవేటీకరణ (Privatization) దిశగా అడుగులు వేస్తోందా అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (Uyyalawada Narasimha Reddy) విమానాశ్రయాన్ని ‘పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్’ (PPP) విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

2026 మే 18న విడుదలైన జి.ఓ. ఎంఎస్ నెం.13 ప్రకారం, ఈ విమానాశ్రయాన్ని ‘ఆపరేట్-మేనేజ్-డెవలప్’ (OMD) మోడల్‌లో ప్రైవేట్ సంస్థల చేత నిర్వహింపజేసేందుకు ప్రభుత్వం ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ (RFP) డ్రాఫ్ట్‌కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం కేవలం పరిపాలనా చర్యగా కాకుండా, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ రంగానికి అప్పగించే పెద్ద విధానంలో భాగమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే 2024లో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి విమానాశ్రయాలను కేంద్ర ప్రభుత్వ ‘మానిటైజేషన్ పైప్‌లైన్’(Monetization Pipeline) కింద ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచనలపై వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు అదే దారిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విమానాశ్రయాల ప్రైవేటీకరణపై వచ్చిన వార్తలను కొట్టిపారేసిన ప్రభుత్వ వర్గాలు, ఇప్పుడు అధికారికంగా OMD మోడల్‌కు ఆమోదం తెలపడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం చెప్పేదానికి, అమలు చేస్తున్న విధానాలకు మధ్య వ్యత్యాసం ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

అదేవిధంగా, ప్రజా ఆస్తుల ద్వారా ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆదాయం రావాల్సిన సమయంలో, వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా తాత్కాలిక ఆర్థిక లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జి.ఓ.లో ప్రభుత్వం అప్‌ఫ్రంట్ ఫీజు, భూమి లీజు అద్దెలు, రెవెన్యూ షేర్ రూపంలో ఆదాయం పొందుతామని పేర్కొన్నప్పటికీ, భవిష్యత్తులో ప్రయాణ ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు, ఇతర సేవల ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరో కీలక అంశం బిడ్డింగ్ నిబంధనల సడలింపు. “బిడ్డర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు” సాంకేతిక కమిటీకి నిబంధనలు సవరించే అధికారాన్ని ఇవ్వడం గమనార్హంగా మారింది. ఇది నిజంగా పోటీని పెంచేందుకా? లేక కొంతమంది పెద్ద సంస్థలకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని కీలక విమానాశ్రయాన్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టే ప్రయత్నం జరగడం విమర్శలకు తావిస్తోంది.

అత్యంత భావోద్వేగ అంశం ఏమిటంటే, ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2021 మార్చి 25న ఈ విమానాశ్రయానికి “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్”గా నామకరణం చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సైతం అప్పట్లో ప్రశంసిస్తూ, తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. అలాంటి చారిత్రక, భావోద్వేగ విలువ కలిగిన విమానాశ్రయాన్ని ఇప్పుడు ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం అభివృద్ధి, పెట్టుబడుల పేరుతో ఆర్టీసీ, మెడికల్ కాలేజీలు , విమానాశ్రయాలు, రోడ్లు, పర్యాటక స్థలాలు ఇలా అన్నీ ప్రవేటు చేతుల్లో పెడుతూ ముందుకెళ్తున్న ఈ విధానం ప్రభుత్వ ఆస్తులను క్రమంగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర కాదా అంటూ తీవ్ర విమర్శలు ప్రశ్నలకు సమాధానం కూటమి ప్రభుత్వం చెప్పక తప్పదని ప్రజలు నుండి వినిపిస్తున్న మాట.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment