తమిళనాడులో (Tamil Nadu) అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీపై(TVK Party) మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ (M. K. Stalin) తీవ్ర విమర్శలు గుప్పించారు. తంజావూర్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. టీవీకే విజయం వెనుక సోషల్ మీడియా (Social Media) ప్రధాన పాత్ర పోషించిందని వ్యాఖ్యానించారు.
ఇన్స్టాగ్రామ్ (Instagram) ద్వారానే టీవీకే అధికారంలోకి వచ్చిందని స్టాలిన్ ఎద్దేవా చేశారు. సాధారణంగా ఎన్నికల్లో అవసరమయ్యే పార్టీ ఏజెంట్లు, బూత్ ఏజెంట్లు, ఓట్ల లెక్కింపు ఏజెంట్లు లేకుండానే ఆ పార్టీ గెలిచిందని అన్నారు. సోషల్ మీడియా ప్రచారంతోనే ప్రజలను ప్రభావితం చేసి విజయం సాధించిందని విమర్శించారు.
చిన్న పిల్లలతో ప్రచారాలు (Campaigns) చేయించి.. వారి తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకున్నారని స్టాలిన్ ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ డీఎంకే ముందుకు సాగుతుందని తెలిపారు.
డీఎంకే పార్టీ ఓటమితో పూర్తిగా ముగిసిపోయిందని కొందరు విమర్శిస్తున్నారని.. అయితే తమ పార్టీ ఇప్పటివరకు ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నదని స్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే ఓడిన ప్రతీసారి ఫీనిక్స్ పక్షిలా మరింత బలంగా తిరిగి వస్తుందని చెప్పారు.
తమ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని ఆయన వెల్లడించారు. ఆ పథకాలు కొనసాగుతున్నంతకాలం తమిళనాడులో ద్రవిడ మోడల్ ప్రభుత్వ (Dravidian Model Government) ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓడిపోయినందుకు తాము చింతించడం లేదని.. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించింది. పార్టీ స్థాపించిన తర్వాత పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే డీఎంకేను ఓడించడం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.






