దేశవ్యాప్తంగా పెరుగుతున్న వీధి కుక్కల (Street Dogs) దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు (Supreme Court of India) కీలక తీర్పు వెలువరించింది. రోడ్లపై(Roads) తిరిగే వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ప్రసక్తే లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2025లో జారీ చేసిన పాత ఉత్తర్వులే అమల్లో కొనసాగుతాయని తేల్చిచెప్పింది. జస్టిస్ విక్రమ్‌నాథ్ (Vikram Nath), జస్టిస్ సందీప్ మెహతా (Sandeep Mehta), జస్టిస్ ఎన్వీ అంజారియాలతో (N. V. Anjaria) కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ (Animal Welfare Board of India) దాఖలు చేసిన అన్ని దరఖాస్తులను కొట్టివేసింది. ప్రజారోగ్యం, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. దేశంలో రేబీస్ (Rabies) వ్యాధి, వీధి కుక్కల దాడుల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
2025 ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలను మరోసారి గుర్తు చేసింది. అప్పట్లో జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన బెంచ్ ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) అధికారులకు వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఆదేశించింది. నసర్గీకరణ, టీకాలు పూర్తయ్యాక మళ్లీ రోడ్లపైకి వదలరాదని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను అడ్డుకునే వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తర్వాత 2025 నవంబర్‌లో మరో కీలక ఆదేశం జారీ చేసింది. పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఆట స్థలాల వంటి పబ్లిక్ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని రాష్ట్రాలు, నేషనల్ హైవే అథారిటీలకు సూచించింది. విద్యా, వైద్య సంస్థల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించాలని, పట్టుకున్న కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలరాదని తెలిపింది. అమాయక పిల్లలపై జరుగుతున్న దాడులు, పెరుగుతున్న రేబీస్ కేసులను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది.
ఈ కేసుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఒకవైపు ప్రజల భద్రత, మున్సిపల్ సంస్థల బాధ్యతలపై వాదనలు వినిపించగా.. మరోవైపు జంతు హక్కుల కార్యకర్తలు మూగజీవాలపై క్రూరత్వం ప్రదర్శించరాదని వాదించారు. కేవలం నిబంధనల ప్రకారం నసర్గీకరణ చేపట్టాలని కోరారు. అన్ని వాదనలు విన్న తర్వాత జనవరి 29న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.. తాజాగా పాత ఆదేశాలకే మద్దతు తెలుపుతూ కీలక తీర్పు వెలువరించింది.
ఈ తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై మరింత కఠిన చర్యలకు మార్గం సుగమం కానుందని భావిస్తున్నారు. ప్రజల రక్షణ, రేబీస్ నివారణ, పబ్లిక్ సేఫ్టీ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.






