---Advertisement---

విజన్ 2020 మాదిరిగానే విజన్ 2047 కూడా విఫలమైతే… ఆ భారాన్ని మోసేది ప్రజలేనా?

May 19, 2026

---Advertisement---

నాటి చంద్రబాబు గారి విజన్ 2020 ఫేయిల్ అయినట్టే 2047 చంద్రబాబు విజన్ కూడా విఫలమైతే ఆ అపార నష్టాన్ని ప్రజలు భరించగలరా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది.

విజన్ 2020 రూపకల్పన 1999 కాలంలో జరిగింది. ఆ ప్రణాళిక లక్ష్యాలను పరిశీలిస్తే, 2020 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అప్పట్లో ప్రచారం చేశారు. అంటే 2020కి రాష్ట్రానికి ఏమి అవసరం, ఏమి అవసరం కాదనే అంశాలను ముందుగానే నిర్ణయిస్తూ చంద్రబాబు నాయుడు తన విజన్‌ను రూపొందించినట్టు కనిపించింది.

అదే సమయంలో జనాభా నియంత్రణను కూడా ఆ అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రకటించారు. 2003 సెప్టెంబర్ 26న అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు 2.5 శాతం తగ్గితే, ఆంధ్రప్రదేశ్‌లో అది 10.5 శాతం తగ్గిందని చెప్పారు. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక ఘనత అని పేర్కొంటూ, ప్రభుత్వం చేపట్టిన ప్రచారాలు, కార్యక్రమాల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని గర్వంగా వివరించారు. జనాభా నియంత్రణను అప్పటి అభివృద్ధి సూచికల్లో ఒక ముఖ్య విజయంగా ప్రదర్శించారు.

అయితే 2020 దశకానికి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయని విమర్శకులు గుర్తుచేస్తున్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ అవసరమని చెప్పిన చంద్రబాబే, తరువాత పిల్లలు కనాలని, ఎక్కువ మంది పిల్లలను ప్రోత్సహించాలని పిలుపునివ్వడం ద్వారా నాటి విజన్ కారణంగా రాష్ట్రానికి దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడ్డాయని పరోక్షంగా ఒప్పుకున్నట్టేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు “స్వర్ణాంధ్ర @ 2047” పేరుతో కొత్త విజన్‌ను ముందుకు తీసుకువస్తున్నారు. రాబోయే 23 ఏళ్లలో “సంపన్నమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్” నిర్మాణమే దీని లక్ష్యమని చెబుతున్నారు. ఇందులో అమరావతి అభివృద్ధిని ప్రధాన కేంద్రంగా చూపిస్తూ భారీ అప్పులతో చేపడుతున్న ప్రాజెక్టులను సమర్థించుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే రేపటి రోజున విజన్ 2020 మాదిరిగానే విజన్ 2047 కూడా విఫలమైతే, దాని ఫలితాలను భరించేది ఎవరు అనే మౌలిక ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతోంది. నాడు జనాభా నియంత్రణ విధానాల వల్ల సమస్యలు ఎదురయ్యాయని ఇప్పుడు అంగీకరిస్తే, రేపు అమరావతి కేంద్రంగా తీసుకుంటున్న భారీ ఆర్థిక నిర్ణయాల ప్రభావం కూడా ప్రజలపైనే పడదా అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దూరదృష్టి పేరుతో తీసుకునే నిర్ణయాలు కాలానుగుణ మార్పులను తట్టుకోలేకపోతే, దాని మూల్యం చెల్లించేది చివరికి ప్రజలేనని పలువురు హెచ్చరిస్తున్నారు. ఒకసారి జరిగిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్లీ అదే విధమైన సుదీర్ఘ విజన్ రాజకీయాలు కొనసాగించడం రాష్ట్ర భవిష్యత్తుపై భారంగా మారొచ్చని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment