---Advertisement---

Meta layoffs: మెటాలో భారీ లేఆఫ్స్‌.. తెల్లవారుజామున 4 గంటలకు ఉద్యోగులకు షాక్ మెయిల్స్!

May 20, 2026

---Advertisement---

ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) మరోసారి భారీ ఉద్యోగాల కోతలకు (Layoffs) శ్రీకారం చుట్టింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ లేఆఫ్స్‌లో భాగంగా సుమారు 8,000 మంది ఉద్యోగాలు కోల్పోతుండటం టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రభావిత ఉద్యోగులకు (Affected Employees) కంపెనీ మెయిల్స్(Emails) పంపించడం ప్రారంభించింది. మొదటగా సింగపూర్‌లోని మెటా ఉద్యోగులకు ఈ సమాచారం అందింది.

బ్లూమ్‌బెర్గ్ (Bloomberg Report) నివేదిక ప్రకారం.. సింగపూర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు మెటా ఈమెయిల్స్ పంపింది. భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి 1:30 గంటలకు సమానం. మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నేతృత్వంలోని ఈ సంస్థ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI) రంగంపై భారీగా దృష్టి సారిస్తోంది. ఈ ఏడాది ఏఐ కోసం బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళిక మధ్య ఈ లేఆఫ్స్ జరగడం గమనార్హం.

ఇదే తరహా ఘటన గతంలో ఒరాకిల్ (Oracle) సంస్థలో కూడా చోటుచేసుకుంది. ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మంది ఉద్యోగులకు ఉదయం 6 గంటల సమయంలో మెయిల్స్ పంపి ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇప్పుడు మెటా కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. వివిధ దేశాల టైమ్ జోన్ల ఆధారంగా ఉద్యోగులకు విడతల వారీగా సమాచారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా(United States), బ్రిటన్ (United Kingdom) సహా పలు దేశాల్లోని ఉద్యోగులను ఈరోజు ఇంటి నుంచే పని చేయాలని మెటా కోరినట్లు సమాచారం.

మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ (Janelle Gale) పంపిన అంతర్గత మెమో ప్రకారం.. 8,000 మంది ఉద్యోగాల కోతతో పాటు మరో 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ ఆధారిత బృందాల్లోకి బదిలీ చేయనున్నారు. అలాగే కంపెనీలో మేనేజర్ల సంఖ్యను తగ్గించి చిన్న చిన్న బృందాలతో వేగంగా పనిచేసే విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది.

ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా మెటా దాదాపు 6,000 ఉద్యోగ ఖాళీలను కూడా రద్దు చేసింది. చిన్న బృందాలతో పని చేయడం వల్ల వేగం, బాధ్యత, ఉత్పాదకత పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ఈ మార్పుల ద్వారా సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేయగలదని జానెల్ గేల్ పేర్కొన్నారు.

గత నెలలోనే 8,000 మంది ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఉద్యోగ భద్రతపై భయం పెరగడంతో చాలామంది ఉద్యోగులు ముందుగానే ఉచిత స్నాక్స్, లాప్టాప్ చార్జర్లు వంటి వస్తువులను తమతో తీసుకెళ్లడం ప్రారంభించినట్లు సమాచారం. కంపెనీలో ఉద్యోగుల నైతిక స్థైర్యం గణనీయంగా పడిపోయినట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక మరోవైపు.. ఉద్యోగుల మౌస్ కదలికలు, కీబోర్డ్ వినియోగాన్ని ట్రాక్ చేసే కొత్త సాఫ్ట్‌వేర్‌ను మెటా ఉపయోగిస్తోందనే వార్తలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఏఐ శిక్షణ కోసం ఈ విధమైన నిఘా చేపడుతున్నారనే ఆరోపణలపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవస్థను వెంటనే నిలిపివేయాలని కోరుతూ 1,000 మందికి పైగా ఉద్యోగులు పిటిషన్‌పై సంతకాలు చేసినట్లు సమాచారం.

గూగుల్, ఓపెన్ఏఐ వంటి సంస్థలతో పోటీలో నిలబడేందుకు మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పుడు పూర్తిగా ఏఐపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది కంపెనీ మొత్తం ఖర్చును 125 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్ల వరకు పెంచాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో అధిక భాగం నిధులు ఏఐ అభివృద్ధికే కేటాయించనున్నారు.

ప్రస్తుతం మెటా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు ఏఐపై దృష్టి పెడుతూ ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఇటీవలే సిస్కో 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా.. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా లేఆఫ్స్ లేదా స్వచ్ఛంద రాజీనామా పథకాలను అమలు చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment