---Advertisement---

విదేశాల్లో రీల్స్.. దేశంలో సంక్షోభం.. మోడీ ‘మెలోడీ’ వీడియోపై రాహుల్ ఫైర్!

May 20, 2026

Summarize with AI

---Advertisement---

దేశంలో ఆర్థిక పరిస్థితులు (Economic Conditions) రోజురోజుకీ దిగజారుతున్నాయని, రైతులు, యువత, మహిళలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) చేసిన చర్యలను ఉద్దేశిస్తూ బుధవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఘాటుగా స్పందించారు.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni)కి మోడీ ‘మెలోడీ’ చాక్లెట్ (Melodi Chocolate) ప్యాకెట్‌ను బహుమతిగా ఇవ్వడం, ఆ వీడియోను మెలోని సోషల్ మీడియాలో పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గమైన రాయ్‌బరేలీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ప్రధాని వైఖరిపై మండిపడ్డారు.

‘దేశంలో ఆర్థిక తుఫాన్ ముంచుకొస్తోంది. కానీ మన ప్రధానమంత్రి మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతూ బిజీగా ఉన్నారు. ఇక్కడ రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులు కన్నీరు పెడుతుంటే.. ప్రధాని నవ్వుతూ రీల్స్ చేసుకుంటున్నారు. దానికి బీజేపీ నేతలు చప్పట్లు కొడుతున్నారు. ఇది నాయకత్వం కాదు.. ముమ్మాటికీ నౌటంకీ’ అంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న మోడీ అక్కడి ప్రధాని జార్జియా మెలోనికి ‘మెలోడీ’ చాక్లెట్ల ప్యాకెట్‌ను గిఫ్ట్‌గా అందించారు. ఆ చాక్లెట్ ప్యాకెట్‌ను చూపిస్తూ మెలోని ‘ప్రధాని మోడీ మా కోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు.. చాలా మంచి చాక్లెట్స్’ అని చెప్పగా, మోడీ నవ్వుతూ ‘మెలోడీ’ అని స్పందించారు. ఈ సెల్ఫీ వీడియోను మెలోని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ‘గిఫ్ట్‌కు థాంక్యూ’ అని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో ఇప్పటికే ‘మెలోడీ’(Melodi) పేరుతో మోడీ, మెలోని సంబంధించి పలు మీమ్స్, ట్రెండ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ కనిపించిన వీడియో ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. దేశంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాని ఇలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment