అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) చింతపల్లి మండలం నిరుతోటపాలెం వద్ద పాస్టర్(Pastor), భరోసా పార్టీ (Bharosa Party) వ్యవస్థాపకుడు అభినయ్ దర్శన్‌పై (Abhinay Darshan) జరిగినట్లు ప్రచారం చేసిన దాడి ఘటన కొత్త మలుపు తిరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో(Knives) దాడి చేశారని, తనకు తీవ్ర గాయాలయ్యాయని అభినయ్ దర్శన్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంతో పాడేరు (Paderu) పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే అనంతరం పోలీసులు చేపట్టిన విచారణ, బయటకు వచ్చిన వీడియో ఫుటేజ్ (Video Footage) ఆధారంగా ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ప్రజల దృష్టిని ఆకర్షించడం మరియు పబ్లిసిటీ (Publicity) పొందడమే లక్ష్యంగా ఈ దాడి కథనాన్ని స్వయంగా సృష్టించినట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో అభినయ్ దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
ఇక ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఘటన జరిగిన వెంటనే వాస్తవాలు నిర్ధారించకుండా ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై (YSR Congress Party) ఆరోపణలు చేయడం అధికార తెలుగుదేశం పార్టీ అలవాటుగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. దాడి జరిగిందనే ప్రచారం వెలువడగానే, ఎటువంటి ఆధారాలు లేకుండానే వైసీపీ నేతలపై ఆరోపణలు చేయడం రాజకీయంగా దుమారం రేపింది.
తాజాగా పోలీసు విచారణలో ఈ ఘటన ఫేక్ డ్రామాగా తేలిన నేపథ్యంలో, నిజ నిర్ధారణ లేకుండానే రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేసే ధోరణిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడమే టీడీపీకి(TDP) లక్ష్యంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






