అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) భారీ స్థాయిలో అవినీతి, దోపిడీ జరుగుతోందని వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లి (Tadepalli) లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రూ.1,200 కోట్లతో తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. మళ్లీ శాశ్వత భవనాల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. కొత్త టెండర్లను కూడా పాత కాంట్రాక్టర్లకే అప్పగించారని, కేవలం 5 భవనాల నిర్మాణ ఖర్చులే ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
చదరపు అడుగుకు రూ.30 వేలు ఖర్చు చూపించడం చూస్తే ఎవరైనా అవాక్కవుతారని జగన్ అన్నారు. కేవలం డిజైన్ల కోసమే రూ.401 కోట్లు ఖర్చు చేశారని, ఈ 5 భవనాల అంచనా వ్యయం రూ.10,665 కోట్లుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. గతంలో చదరపు అడుగుకు రూ.5 వేలలోపు ఖర్చు అయ్యే పనులకు ఇప్పుడు కేవలం సివిల్ వర్క్స్‌కే రూ.20,427 చూపిస్తున్నారని తెలిపారు. ఫర్నీచర్, ఇంటీరియర్ కలిపితే ఒక్క చదరపు అడుగుకు రూ.30 వేల వరకు వెళ్తోందని చెప్పారు. ఫైవ్ స్టార్ హంగులతో నిర్మించినా రూ.4,500 లోపే అవుతుందని, తెలంగాణ (Telangana) మాజీ సీఎం కేసీఆర్ (KCR) రూ.615 కోట్లతో అద్భుతమైన సచివాలయం నిర్మిస్తే.. ఏపీ సచివాలయానికి ఇంత భారీ వ్యయం ఎందుకని ప్రశ్నించారు. అమరావతి కోసం ఇప్పటికే రూ.47,387 కోట్ల అప్పులు చేశారని, మరో రూ.9,200 కోట్లు ఖజానా నుంచి ఖర్చు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు.
అమరావతి నిర్మాణం ఆచరణ సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు కేవలం స్కామ్‌ల కోసమే ముందుకెళ్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని వసతులు కలిగిన ‘మావిగన్’ (MAVIGUN) ను ప్రత్యామ్నాయ రాజధానిగా ప్రతిపాదించామని, దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. మావిగన్ పేరు వినగానే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఆయనతో పాటు మంత్రులు కూడా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షం తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టి అణగదొక్కుతున్నారని, రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’గా మార్చేశారని మండిపడ్డారు. ఈ రెండేళ్ల పాలనలో ఒక్క ప్రోగ్రెస్ మాత్రమే కనిపిస్తోందని.. అది “చంద్రబాబు షూరిటీ – మోసం గ్యారంటీ” అంటూ జగన్ ఎద్దేవా చేశారు.
టీడీపీ నేతలు చేస్తున్న ‘గొడ్డలి పోటు’ విమర్శలపై కూడా జగన్ తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు హత్యా రాజకీయాలకు బలయ్యారని గుర్తుచేశారు. “మా తాత రాజారెడ్డి (Raja Reddy) హత్య చేసిన వారిని టీడీపీ ఆఫీసులో దాచింది నిజం కాదా?” అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ (YSR) మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు “నువ్వు మళ్లీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా” అంటూ బెదిరించలేదా అని నిలదీశారు. వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కూడా టీడీపీ పాలనలోనే జరిగిందని గుర్తు చేశారు.
వంగవీటి రంగ (Vangaveeti Ranga) హత్య వెనుక కూడా చంద్రబాబు ఉన్నారని హరిరామ జోగయ్య (Harirama Jogaiah) స్వయంగా చెప్పారని జగన్ అన్నారు. ఆ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ (Velagapudi Ramakrishna) ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని విమర్శించారు. సొంత మామ ఎన్టీఆర్ (NTR) కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబుకు.. గొడ్డళ్లు, గుణపాల రాజకీయాలు కొత్త కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరిది ‘గొడ్డలి పార్టీ’నో ప్రజలకు బాగా తెలుసని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






