భారత రాజకీయాలపై సెటైర్లు, వ్యంగ్య పోస్టులతో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’(Cockroach Janata Party)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యంగ్య రాజకీయ సంస్థ అధికారిక ఎక్స్ ఖాతా (X Account) @CJP_2029 ను భారతదేశంలో నిలిపివేశారు (Suspended).. కొద్ది రోజుల్లోనే కోట్లాది ఫాలోవర్లను సంపాదించి సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసిన ఈ పార్టీ అకౌంట్ అకస్మాత్తుగా బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ విషయాన్ని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijit Dipke) స్వయంగా వెల్లడించారు. ఎక్స్ ఖాతా ఓపెన్ చేసినప్పుడు కనిపించిన పాప్అప్ స్క్రీన్‌షాట్‌ను (Popup Screenshot) షేర్ చేస్తూ.. “మేము ఊహించినట్టుగానే కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు” అని పేర్కొన్నారు. ఖాతా నిలిపివేతకు సంబంధించి ఎక్స్ ఇచ్చిన వివరణలో.. “చట్టపరమైన డిమాండ్ కారణంగా భారత్‌లో ఈ ఖాతాను నిలిపివేశాం” అని తెలిపింది. సాధారణంగా ప్రభుత్వ లేదా అధికారిక సంస్థల నుంచి వచ్చిన లీగల్ రిక్వెస్ట్‌లు లేదా స్థానిక చట్టాల ఉల్లంఘనల నేపథ్యంలో మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) మాత్రం ఈ వ్యంగ్య పార్టీ దూసుకుపోతోంది. కేవలం 4 రోజుల్లోనే 13.5 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 8.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. కాక్రోచ్ జనతా పార్టీ 13.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ముందంజలో నిలిచింది. “ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అంటారు కదా” అంటూ బీజేపీపై ఈ పార్టీ వేసిన సెటైరికల్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఎక్స్ ఖాతా బ్లాక్ అయిన కొద్దిసేపటికే తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిజీత్ దిప్కే ఆరోపించారు. ఇందుకు సంబంధించిన లాగిన్ అలర్ట్ ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.
ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతపై చేసిన వ్యాఖ్యల తర్వాతే ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆవిర్భవించింది. కొంతమంది నిరుద్యోగులను “బొద్దింకలు”, “పరాన్నజీవులు” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీశాయి. దీనికి నిరసనగా అభిజీత్ దిప్కే ఈ వ్యంగ్య రాజకీయ వేదికను ప్రారంభించారు.
“మా పార్టీలో చేరాలంటే నిరుద్యోగి అయి ఉండాలి.. బద్ధకస్తుడై ఉండాలి.. రోజంతా ఆన్లైన్లో ఉండి ప్రొఫెషనల్‌గా విమర్శలు చేయగలగాలి” అంటూ ఈ సంస్థ తమ అర్హతలను వ్యంగ్యంగా ప్రకటించుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంది. 30 ఏళ్ల అభిజీత్ దిప్కే బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. రాజకీయ కమ్యూనికేషన్ వ్యూహకర్తగా పేరున్న ఆయన.. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీమ్‌తో పాటు ఎన్నికల ప్రచార వ్యూహాల్లో కూడా పనిచేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టిస్తున్న హంగామా.. భారత రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది.






