ఆడపిల్లల భద్రత, మహిళల గౌరవం, వేధింపులపై కఠిన చర్యలు… ఇవే నినాదాలతో ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై వేధింపులు, మోసం, గృహహింస, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ నాయకుల విషయంలో పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయంగా మాత్రమే కాదు, సామాజికంగానూ చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల సభల్లో మహిళల రక్షణ కోసం తాము “కవచంలా” నిలుస్తామని, మహిళలపై అన్యాయం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రకటించిన జనసేన నాయకత్వం… ఇప్పుడు అదే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల విషయంలో మాత్రం కేవలం “పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి” అనే లేఖలతో సరిపెట్టుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత వివాదాస్పదంగా మారిన అంశం ఏమిటంటే… కొన్ని రోజులు గడిచాక అదే నేతలను తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనించడం.
ఈ వ్యవహారం ప్రజల్లో “చర్యలు కేవలం డైవర్షన్ కోసమేనా?” అనే ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళా హక్కులపై పెద్ద ఎత్తున మాట్లాడిన పార్టీ నుంచి ఇలాంటి స్పందన రావడం మహిళా సంఘాలు, సామాజిక వర్గాల్లో అసంతృప్తిని పెంచుతోంది.
పార్టీకి చెందిన పలువురు నాయకులపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ప్రధాన రాజకీయ చర్చల వరకూ చేరాయి. తిరుపతి ఇంచార్జ్‌గా ఉన్న కిరణ్ రాయల్‌పై మహిళ వేధింపుల ఆరోపణలు, ఆడియోలు–వీడియోలు బయటకు వచ్చినప్పటికీ కఠిన చర్యలు కనిపించలేదని విమర్శలు వచ్చాయి. అలాగే ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై పెళ్లి పేరుతో మోసం చేసి మహిళను ఉపయోగించుకున్నారనే ఆరోపణలు రావడం, బాధితురాలిపై దాడి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కూడా పార్టీ వైఖరి ప్రశ్నార్థకంగా మారింది.
అదే విధంగా జడ్పీటీసీ జయప్రకాశ్ నాయుడు, మత్స్యకార విభాగం నాయకుడు మల్లాడి రాజు, భైరవ ప్రసాద్, సూర్య చంద్ర తదితరులపై వచ్చిన వివిధ మహిళా ఫిర్యాదులపై కూడా పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సందర్భంలోనూ ఒకే విధమైన “తాత్కాలిక దూరం” అనే టెంప్లెట్ ఉపయోగించడం ఇప్పుడు ప్రజల్లో వ్యంగ్యానికి కారణమవుతోంది.
ఇటీవల నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ సర్పంచ్ తిరుమాన వెంకట రాజుపై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో “ఆరోపణలు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి” అని సూచించడం మరోసారి అదే పాత ఫార్ములా కొనసాగుతోందన్న అభిప్రాయాన్ని బలపరిచింది. దీంతో సోషల్ మీడియాలో “ జనసేనలో మహిళలపై అఘాయత్యానికి పాల్పడే వ్యక్తులు మారుతున్నారు… కానీ యాక్షన్ టెంప్లెట్ మాత్రం మారడం లేదు” అంటూ తీవ్ర ట్రోలింగ్ జరుగుతోంది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మహిళా భద్రత వంటి సున్నితమైన అంశాలపై రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రమాణాలు సొంత నాయకుల విషయంలో అమలు చేయకపోతే ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింటుంది. ముఖ్యంగా ఒక పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులపై నైతిక విలువల పేరుతో విమర్శలు చేస్తూ, సొంత నేతల విషయంలో మాత్రం మౌనం పాటిస్తే అది రాజకీయ ద్వంద్వ వైఖరిగా కనిపించే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు మహిళా సంఘాలు మాత్రం మరింత ఘాటుగా స్పందిస్తున్నాయి. మహిళల గౌరవం, భద్రత, న్యాయం అనే అంశాలు కేవలం రాజకీయ నినాదాలుగా మారకూడదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టపరమైన విచారణ పూర్తయ్యే వరకు పార్టీలు కఠిన వైఖరి అవలంబించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే మహిళల రక్షణపై రాజకీయ నాయకులు చేసే ప్రకటనలు ప్రజల్లో నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.






