విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పద్మనాభ నగర్‌లో నిర్మించిన కాపు భవన్ ప్రారంభోత్సవం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో జి.వి.ఎం.సి నిధులతో (GVMC Funds) సుమారు రూ.1.90 కోట్ల వ్యయంతో నిర్మాణం ప్రారంభమైన ఈ భవనం దాదాపు పూర్తయ్యాక రెండేళ్లకు ఎమ్మెల్యే గణబాబు (Ganababu) చేతుల మీదుగా ప్రారంభమైంది.
అయితే ఈ కార్యక్రమానికి కాపు సామాజిక వర్గానికి (Kapu Community) చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, ప్రతినిధులకు ఆహ్వానం అందలేదనే ప్రచారం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫోటోను కూడా ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రదర్శించకపోవడం పట్ల ఆ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కాపు భవన్ ప్రారంభోత్సవాన్ని (Kapu Bhavan Inauguration Event) విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు (Ganababu), ఎంపీ భరత్ (Bharat) కలిసి నిర్వహించగా.. కాపు నేతలను పక్కన పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ సామాజిక వర్గానికి సంబంధించిన భవన్ ప్రారంభోత్సవంలో కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదని పలువురు కాపు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇక కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి నాయకులు కర్ర సహాయంతో పూలమాల వేయడం కూడా వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం వ్యవహారం ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.






