---Advertisement---

నాలుగు వారాల్లో కుటుంభ వివాదాలు సెటిల్ చేసుకోవాలని పోలవరం ఎమ్మెల్యేకు పవన్ గడువు!

May 23, 2026

---Advertisement---

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju) శనివారం సమావేశమవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలవరం నియోజకవర్గంలో (Polavaram Constituency) ఎమ్మెల్యే పని తీరుపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. పార్టీ దృష్టికి వచ్చిన ఆరోపణలు, వివాదాలపై పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బాలరాజును వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, కుటుంబ సంబంధిత విషయాలను సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని బాలరాజు కోరగా, నాలుగు వారాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని పవన్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుంచే ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయని, చట్టపరమైన చర్యలకు బదులుగా “సెటిల్ చేసుకోండి” అనే విధంగా సూచనలు ఇవ్వడం సరైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితుల పక్షాన నిలవాల్సిన నాయకత్వం రాజీ మార్గం చూపుతోందంటూ విమర్శకులు మండిపడుతున్నారు.

పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అసంతృప్తి మొదటి నుంచే ఉందనే అభిప్రాయం కూటమి పార్టీల కార్యకర్తల్లో వినిపిస్తోంది. దందాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయనే ఆరోపణలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఓ టీడీపీ(TDP) కార్యకర్త సోషల్ మీడియాలో విడుదల చేసిన సెల్ఫీ వీడియో పెద్ద దుమారం రేపింది. ప్రభుత్వం ఇసుక ఉచితం (Sand Free) అని ప్రకటించినప్పటికీ, స్థానికంగా ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున వసూళ్లు చేస్తున్నారని ఆ వీడియోలో ఆరోపించారు. బోర్లు, వృద్ధాప్య పింఛన్లు, బెల్ట్ షాపులు, వీఆర్వో బదిలీలు, ఆర్ అండ్ ఆర్ భూముల మార్పిడుల వరకు లంచాల వ్యవస్థ (Bribery System) నడుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

అలాగే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలోనే భారీగా ఆస్తులు కూడబెట్టారని, మట్టి-ఇసుక అక్రమ రవాణా, పేకాట క్లబ్బులు(Gambling Clubs), క్రికెట్ బుకీల (Cricket Bookies) ద్వారా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కుటుంబ పరంగా కూడా అనైతిక వ్యవహారాలపై ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత వివాదాస్పదంగా మార్చింది. ఈ అంశాలను ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై తక్షణ చర్యలు తీసుకోకుండా, సమస్యలను “సర్దుబాటు చేసుకోవాలి” అంటూ గడువు ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి సందేశం ఇస్తున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయంగా వేడెక్కుతోంది. అధికారంలోకి వస్తే పారదర్శక, స్వచ్ఛమైన పాలన అందిస్తామని ప్రకటించిన జనసేన నాయకత్వం, ఇప్పుడు అదే ప్రమాణాలను అమలు చేస్తుందా లేదా అన్న ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment