ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన (TDP-Jana Sena) కూటమిలో అంతర్గత విభేదాలు రోజురోజుకీ బహిర్గతమవుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది. కూటమి కొనసాగింపుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పదేపదే “15 ఏళ్లు పొత్తు కొనసాగుతుంది” అని చెప్పడం వల్లే టీడీపీ నాయకులకు ధైర్యం పెరిగి, జనసేన కార్యకర్తలపైనే దాడులకు తెగబడుతున్నారనే ఆవేదన జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా “కూటమిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.. అందరూ సర్దుకుపోవాలి” అని పలుమార్లు వ్యాఖ్యానించడం కూడా జనసేన అభిమానులను అసంతృప్తికి గురిచేసింది. ఈ వ్యాఖ్యల అనంతరం చోటుచేసుకుంటున్న ఘటనలు కూటమి భవిష్యత్తుపై కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి.
తాజాగా బాపట్ల జిల్లా (Bapatla District) కొల్లూరులో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నూడిల్స్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న జనసైనికుడు ఉప్పు జానకిరామయ్యపై (Uppu Janakiramayya), మాజీ ఎంపీపీ కనగాల మధుసూధన్ ప్రసాద్‌ను (Kanagala Madhusudhan Prasad) విమర్శించాడనే కారణంతో టీడీపీ వర్గీయులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాక, జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన జానకిరామయ్య కుటుంబ సభ్యులపైనా అక్కడే మరోసారి దాడి జరగడం కలకలం రేపింది.
ఇది ఒక్కటే కాదు.. గత రెండేళ్లుగా కూటమి పాలనలో జనసేన కార్యకర్తలు, నాయకులపై దాడులు, వేధింపులు, ఆత్మహత్యలు, హత్యలు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయ్ గ్రామంలో జనసేన కార్యకర్త అంబటి దీపు హత్య నుంచి మార్కాపురం జిల్లా ఇడుపూరు గ్రామానికి చెందిన సంకుల మల్లయ్య హత్య వరకు పలు ఘటనలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు (Tirumalashetty Lakshminaidu) హత్య, గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో కాల్ మనీ వేధింపుల కారణంగా కాపు మహిళ శేషమ్మ (Sheshamma) ఆత్మహత్య, కైకలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త విన్నకోట రామకృష్ణ (Vinnakota Ramakrishna) ఆత్మహత్య వంటి ఘటనలు కూటమి అంతర్గత పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
అలాగే అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్పపై (Kotipalli Ayyappa) కత్తులతో దాడి, కొవ్వూరు, గుడివాడ, చింతపాడు, సత్తెనపల్లి, సోమల, మచిలీపట్నం, శ్రీకాళహస్తి, వట్టిచెరుకూరు వంటి ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడులు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.
ప్రత్యేకంగా మచిలీపట్నంలో బ్యానర్ వివాదం కారణంగా జనసేన నేతలను టీడీపీ కార్యకర్తలు దారుణంగా కొట్టిన ఘటన, అలాగే టీడీపీ నేతల కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరుతున్న జనసేన నేతల వీడియో వైరల్ కావడం తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వరుస ఘటనలు చూస్తుంటే, అధికార కూటమిలో పైకి సఖ్యత కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం తీవ్ర అసంతృప్తి, ఆధిపత్య పోరు కొనసాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జనసేన క్యాడర్లో పెరుగుతున్న అసహనం భవిష్యత్తులో కూటమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






