రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హత్య రాజకీయాల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో జరిగిన రాజకీయ నేతల హత్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వేడిని మరింత పెంచాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో తన తాత రాజారెడ్డి (Raja Reddy), బాబాయ్ వైఎస్ వివేకానందారెడ్డి (Y. S. Vivekananda Reddy) సహా పలువురు నాయకులు హత్యకు గురయ్యారని జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ(TDP) నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ నేత బీటెక్ రవి (BTech Ravi) మాట్లాడుతూ రాజకీయ హత్యలకు నాంది పలికింది వైఎస్ కుటుంబమేనని (YS Family) ఆరోపించారు. ముఖ్యంగా రాజారెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీటెక్ రవిపై ఎదురు దాడి ప్రారంభించారు. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) ఘాటుగా స్పందిస్తూ బీటెక్ రవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“బీటెక్ రవి వాడు వీడు అనే స్థాయిలో మాట్లాడుతున్నాడు. నీ గురించి మేము మాట్లాడాలంటే ఎంత సేపు పడుతుంది?. నువ్వెంత.. నీ బతుకెంత?” అంటూ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, ముగ్గురాయి వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడి బతికేవాడివని ఆరోపించారు. జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు.
అంతేకాకుండా గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో బీటెక్ రవి విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇంటికి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్సీ పదవి కోసం రూ.12 కోట్ల వ్యవహారం జరిగిందని ఆరోపించారు. తన ఎమ్మెల్సీ (MLC) పదవిని అమ్ముకోవడానికి ప్రయత్నించాడని, వైఎస్సార్సీపీలో చేరేందుకు కూడా ప్రయత్నించాడని అన్నారు. జగన్ అలాంటి రాజకీయాలకు ఒప్పుకోలేదని పేర్కొన్నారు.
“వైఎస్సార్సీపీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్‌ను (C. M. Ramesh) పట్టుకుని బీజేపీలోకి(BJP) వెళ్తానని చెప్పింది నువ్వు కాదా?” అంటూ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే స్థాయికి దిగజారిన వ్యక్తి బీటెక్ రవేనని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి.






