పశ్చిమాసియాలో (West Asia) మరోసారి యుద్ధ (War) మేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని (Southern Iran) క్షిపణి ప్రయోగ కేంద్రాలు (Missile Launch Centers), ఇరానియన్ నౌకలను (Iranian Ships) లక్ష్యంగా చేసుకుని అమెరికా (America) ఆత్మరక్షణ దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిసరాల్లో జరిగిన ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరానియన్ దళాల నుంచి తమ సైన్యానికి పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టేందుకు, తమ బలగాల రక్షణ కోసమే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.
అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ (Captain Tim Hawkins) వెల్లడించిన వివరాల ప్రకారం, హార్ముజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన 2 పడవలు సముద్ర మైన్లు అమర్చే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుని బందర్ అబ్బాస్ (Bandar Abbas) ప్రాంతంలోని ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి కేంద్రం దాడికి సిద్ధమైనట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించిన అమెరికా బలగాలు ఆ క్షిపణి కేంద్రాన్ని ధ్వంసం చేశాయి.
ఈ ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన 2 నౌకలు, 1 క్షిపణి కేంద్రం పూర్తిగా నాశనం అయినట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు. అయితే ఈ దాడులు పూర్తిగా పరిమిత స్థాయిలోనే జరిగాయని, ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చకుండా సంయమనంతో వ్యవహరించినట్లు అమెరికా పేర్కొంది.
దాడుల అనంతరం హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇరాన్ తీరప్రాంత నగరమైన బందర్ అబ్బాస్‌తో పాటు సిరిక్, జాస్క్ ప్రాంతాల సమీపంలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.
రాజకీయంగా కూడా పరిస్థితులు వేడెక్కుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఇరాన్‌ను భాగస్వామిగా చేసుకుని పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాన్ని విస్తరించే ప్రయత్నాలు కూడా అమెరికా ముమ్మరం చేయడం గమనార్హంగా మారింది.







