తమ కుమార్తె సుగాలీ ప్రీతి కేసులో (Sugali Preethi Case) న్యాయం చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు సుగాలీ పార్వతి(Sugali Parvathi), రాజు నాయక్‌లు (Raju Nayak) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహనరెడ్డిను (Y. S. Jagan Mohan Reddy) కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో టీడీపీ(TDP) ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటనలో తమ కుమార్తెపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని, చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. అలాగే తమ కుమార్తె మరణాన్ని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఐదేళ్ల పాటు రాజకీయాలకు వాడుకున్నారని కూడా వారు ఆరోపించారు.
సుగాలీ ప్రీతి కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే, 2017 ఆగస్టు 19న కర్నూలు సమీపంలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల సుగాలీ ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్కూల్ యాజమాన్యం (School Management) ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పినా, తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యాచారం అని, స్కూల్ యాజమాన్యానికి చెందిన వ్యక్తులే తమ కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసులో నిందితులను కాపాడేందుకు అప్పటి టీడీపీ(TDP) నేతలు ప్రయత్నించారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వచ్చారు.
2017 నుంచి 2019 ఎన్నికల వరకు కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రీతి కుటుంబం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అదే సమయంలో అప్పటి అధికార ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ కేసుపై స్పందించలేదని విమర్శలు వచ్చాయి. అంతేకాక, ఆధారాలు చెరిపివేసే ప్రయత్నాల కారణంగా డీఎన్‌ఏ (DNA) సరిపోలలేదని కోర్టు భావించి నిందితులకు బెయిల్(Bail) మంజూరు చేసిన అంశం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. కనీసం చట్టపరంగా రావాల్సిన పరిహారం కూడా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదని దళిత వర్గాల నుండి ఆరోపణలు వచ్చాయి.
తర్వాత పాదయాత్రలో ఉన్న జగన్మోహనరెడ్డిను కలిసిన ప్రీతి తల్లిదండ్రులు తమ బాధను వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును తిరిగి విచారిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలోకి వచ్చిన అనంతరం కేసును తిరిగి విచారించేందుకు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిణి రమాదేవిని (Ramadevi) నియమించారు. దీంతో కేసు పునర్విచారణ ప్రారంభమవుతుండటాన్ని ప్రీతి కుటుంబం సైతం స్వాగతించింది.
దీంతో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్, సుగాలీ ప్రీతి హత్య జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎక్కడలేని హడావిడి చేశారు. సిట్(SIT) విచారణ మధ్యలో ఉండగానే, 2019 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో దిశా నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో, సుగాలీ ప్రీతి కేసును వెంటనే ఛేదించాలని, లేని పక్షంలో కర్నూలులో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించారు. సుగాలీ ప్రీతి తల్లిదండ్రులను మంగళగిరి కార్యాలయానికి పిలిపించుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయించారు.
2020 ఫిబ్రవరి 18న జగన్ కర్నూల్ పర్యటన ఖరారవ్వగానే, పవన్ కళ్యాణ్ 2020 ఫిబ్రవరి 12న కర్నూలుకు వెళ్లి ర్యాలీ నిర్వహించి, ఈ కేసును సీబీఐకి(CBI) అప్పగించాలని సుగాలీ ప్రీతి తల్లితో డిమాండ్ చేయించారు. ఈ నేపథ్యంలో, డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో దశ ప్రారంభోత్సవానికి 2020 ఫిబ్రవరి 18న కర్నూలుకు వచ్చిన జగన్‌ను సుగాలీ ప్రీతి తల్లిదండ్రులు కలిసి, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. అయితే, అలా కోరేలా వారిని పవన్ కళ్యాణ్ మరియు ఆయన బృందం ప్రేరేపించారనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం బాలిక తల్లి కోరిక మేరకు సిట్ విచారణ మధ్యలో ఆపేసి జీవో నెం.37 జారీ చేసి కేసును సీబీఐకి అప్పగించింది. అప్పట్లో ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పవన్ కళ్యాణ్ కూడా ప్రకటన చేశారు. అయితే కేసు సీబీఐకి వెళ్లిన తర్వాత కూడా రాజకీయ విమర్శలు మాత్రం ఆగలేదు. జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ, కేసును రాజకీయ వేదికల్లో పదేపదే ప్రస్తావించిన పవన్ కళ్యాణ్, నిందితులు టీడీపీకి చెందిన వారనే అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అలాగే బాధిత కుటుంబం ఎవరిపై ఆరోపణలు చేస్తోందో కూడా ఆయన బహిరంగంగా చెప్పలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉండగా, కేసు సీబీఐకి అప్పగించినా జగన్ ప్రభుత్వం తమ భాధ్యత మరవకుండా ప్రీతి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది. 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ.8 లక్షల ఆర్థిక సాయం, ఐదు సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల వ్యవసాయ భూమి, అలాగే ఆమె తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఈ అంశాన్ని ప్రీతి కుటుంబం పలు సందర్భాల్లో ప్రస్తావించింది.
2024 ఎన్నికల సమయంలో సుగాలీ ప్రీతి కేసును పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుపై మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీతో(BJP) సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సీబీఐ దర్యాప్తు వేగవంతం చేయాలనే అంశంపై ఆయన స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడం తమ వనరులతో సాధ్యం కాదని సీబీఐ హైకోర్టుకు తెలిపినట్లు వార్తలు రావడంతో బాధిత కుటుంబం మరింత ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈ పరిస్థితుల్లో సుగాలీ ప్రీతి తల్లిదండ్రులు న్యాయం కోసం కర్నూలు నుంచి అమరావతి వరకు న్యాయపోరాట యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అనుమతులు నిరాకరించిందని, జనసేన నాయకులు తమను దుర్భాషలాడారని వారు ఆరోపించారు. ఈ పరిణామాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సిట్ విచారణ సాగుతున్న సమయంలో పవన్ కళ్యాన్ కలగచేసుకొకపోయి ఉంటే ఆ పసి హృదయానికి ఇప్పటికే న్యాయం దక్కేదని ఉద్దేశపూర్వకంగానే కేసును రాజకీయం చేయడం వెనుక బడాబాబుల హస్తం ఉందా అనే అనుమానాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి.






