తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) కుటుంబ పండుగగా, పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవ వేదికగా పేరుగాంచిన ‘మహానాడు’ (Mahanadu) ఈసారి ఊహించని వివాదాలకు కేంద్రబిందువుగా మారినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన తొలి మహానాడు కావడంతో పార్టీ శ్రేణుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇస్తారు అనే ఆసక్తి అన్ని స్థాయిల నాయకుల్లో కనిపించింది.
అయితే మహానాడు వేదికపై నారా లోకేష్ చేసిన ప్రసంగం ఇప్పుడు పార్టీ అంతర్గత వర్గాల్లోనే తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జనసేన (Jana Sena Party) అధినేత పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) ఆయన చేసిన అతిశయోక్తి ప్రశంసలు తెలుగుదేశం కార్యకర్తల్లో అసంతృప్తిని రేకెత్తించినట్టుగా సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అరెస్టు సమయంలో టీడీపీ క్యాడర్ (TDP Cadre) రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు (Protests), ఉద్యమాలు (Agitations) ప్రస్తావించకుండా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే తమ కుటుంబానికి అండగా నిలిచారనే భావన వచ్చేలా ప్రసంగించడం కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడిన కార్యకర్తల త్యాగాలను పక్కన పెట్టి మహానాడు వంటి పార్టీ ఆత్మగౌరవ వేదికపై మరో పార్టీ అధినేతను అతిగా పొగడటం సరైన సంకేతం కాదని టీడీపీ సీనియర్ నాయకులలోనే అసంతృప్తి వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సహకారాన్ని ప్రశంసించేందుకు వేరే వేదికలు ఉన్నప్పటికీ, మహానాడును అందుకు ఉపయోగించడం ద్వారా పార్టీ శక్తిసామర్థ్యాలను నాయకత్వమే తగ్గించి చూపిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక ఇప్పటికే 2026 మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహించడంపై కొంత అసహనం వ్యక్తమవుతుండగా, ఇప్పుడు ప్రసంగాల ద్వారా వచ్చిన ఈ వివాదం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ నాయకత్వంపై ఆశలు పెట్టుకున్న కార్యకర్తలకు ఈ మహానాడు నిరాశ మిగిల్చిందని, ఇలాంటి పరిణామాలు రాబోయే రోజుల్లో పార్టీకి రాజకీయంగా నష్టాన్ని కలిగించే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






