ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) ఇటీవల విడుదలైన డీఎస్సీ(DSC) ఫలితాలు తీవ్ర వివాదాలకు దారితీశాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పోస్టుల (Sports Quota Posts) భర్తీ, పేపర్ లీకేజీ (Paper Leakage) ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు కారణమయ్యాయి. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను డబ్బులకు అమ్ముకున్నారని, అర్హత లేని వారికి బోగస్ సర్టిఫికెట్ల (Bogus Certificates) ఆధారంగా నియామకాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం (YSRCP Student Wing), నిరుద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. ఈ వ్యవహారంపై సమగ్ర సీబీఐ(CBI) విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అన్ని జిల్లాల్లోనూ వైసీపీ విద్యార్థి విభాగం నేతలు, నిరుద్యోగులు, అభ్యర్థులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. కొంతమంది అభ్యర్థులు ఉరేసుకున్నట్లుగా వినూత్న నిరసనలు చేపట్టారు. ఉపాధ్యాయ నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ దర్యాప్తు అవసరమని వారు పేర్కొన్నారు.
గుంటూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్య (Panuganti Chaitanya) మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మెగా డీఎస్సీ (Mega DSC) హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పూర్తిగా అక్రమాల పుట్టగా మారిందని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ “మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ” (“Not Mega DSC.. It is Fraud DSC”) అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు డబ్బులకు అమ్ముకుని ఉద్యోగాలను అక్రమంగా కేటాయించారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి (Lella Appi Reddy) మాట్లాడుతూ యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. కర్నూలులో ఎమ్మెల్యే వీరుపాక్షి (Veerupakshi) మాట్లాడుతూ మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారని, అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేసి మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. విచారణ కోరితే కేసులు పెడుతున్నారని విమర్శించారు.
విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ అంబేద్కర్ కూడలిలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన చేపట్టి డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. నెల్లూరులో జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి కాకాణి (Kakani), భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakar Reddy) తదితరులు పాల్గొన్నారు. భూమన మాట్లాడుతూ ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 నుంచి రూ.20 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఓపెన్ కేటగిరి కటాఫ్ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అన్నారు.
అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో అదనపు కోటాలను కలిపి అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారని, లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు, నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలు ఇప్పుడు రాజకీయంగా మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.






