తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress – TMC) ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న అభిషేక్‌కు తాజాగా బెంగాల్ సీఐడీ(CBI) నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
శనివారం మధ్యాహ్నం సీఐడీ అధికారులు అభిషేక్ కార్యాలయం అయిన “శాంతినికేతన్”(Shantiniketan)కు చేరుకుని నోటీసులు అందజేయడానికి ప్రయత్నించారు. సోమవారం భవానీ భవన్‌లోని (Bhawani Bhavan) సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో అభిషేక్ అక్కడ లేకపోవడంతో అధికారులు నోటీసులను అందజేయలేకపోయారు.
అనంతరం మరో సీఐడీ బృందం (CID Team) కాళీఘాట్‌లోని మరో కార్యాలయానికి వెళ్లి అభిషేక్ బెనర్జీకి నోటీసులు అందించింది. ఈ విషయంపై స్పందించిన ఆయన, నోటీసులను పూర్తిగా పరిశీలించలేదని తెలిపారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
తనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీసు యంత్రాంగం, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాజకీయ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని అభిషేక్ ఆరోపించారు. గతంలో కేవలం 2 నుంచి 3 దర్యాప్తు సంస్థలు మాత్రమే తనను లక్ష్యంగా చేసుకున్నాయని, ఇప్పుడు ఆ సంఖ్య 5కు పెరిగిందని వ్యాఖ్యానించారు.
“వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేసుకోనివ్వండి. వారికి నచ్చిన విధంగా వ్యవహరించవచ్చు. గతంలో ఈడీ(ED), సీబీఐ(CBI) మాత్రమే ఉండేవి. ఇప్పుడు బెంగాల్ పోలీసులు, కోల్‌కతా పోలీసులు, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా జతకలిశాయి. నాపై 5 నుంచి 6 సంస్థలను ఉసిగొలిపి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. నా గొంతు కోసినా సరే, మీకు నచ్చినట్లు ఏం చేసినా సరే నన్ను లొంగదీసుకోవాలంటే ఏడు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. నేను దేశద్రోహిని కాదు” అంటూ ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.
సంతకాల ఫోర్జరీ కేసు ఏమిటి?
తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో పరాజయం పొందిన అనంతరం అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపిక విషయంలో వివాదం చెలరేగింది. సీనియర్ నేత సోవన్ దేబ్ చటర్జీని (Sovandeb Chattopadhyay) శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే ప్రక్రియలో కొందరు ఎమ్మెల్యేల అనుమతి లేకుండానే వారి సంతకాలను (Signatures) ఫోర్జరీ (Forgery) చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ కేసును సీఐడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కునాల్ ఘోష్(Kunal Ghosh), నయనా బందోపాధ్యాయలను అధికారులు విచారించారు. ఇప్పుడు అభిషేక్ బెనర్జీకి నోటీసులు జారీ కావడంతో కేసు రాజకీయంగా మరింత వేడెక్కింది.








