దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ (Malviya Nagar) ప్రాంతంలో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో (Lemon Green Restaurant) బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ ప్రమాదానికి దారితీశాయి. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనతో మొత్తం ప్రాంతం భయాందోళనలకు గురైంది.
హౌజ్ రాణి (Hauz Rani) ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్లో ఉదయం సుమారు 8.50 గంటల సమయంలో మంటలు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్ మొత్తం పొగతో నిండిపోయింది. ముఖ్యంగా బేస్మెంట్లో (Basement) ఉన్న వారు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9.45 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలను ఘటనాస్థలికి తరలించింది.
మంటలు అదుపు తప్పి వ్యాపించడంతో బేస్మెంట్లో చిక్కుకుపోయిన పలువురిని అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి రక్షించారు. మొత్తం 37 మందిని సురక్షితంగా బయటకు తీసి క్యాట్స్ అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం గాయపడిన 11 మందికి చికిత్స కొనసాగుతోంది. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి 10 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. గంటల పాటు శ్రమించిన తర్వాత మంటలను నియంత్రించగలిగారు.
అయితే భవనంలో ఇంకా ఎవరైనా చిక్కుకుపోయి ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ, పోలీసులు భవనాన్ని పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ (Electrical Short Circuit) కారణమా..? లేక అగ్నిమాపక భద్రతా లోపాల వల్ల ప్రమాదం జరిగిందా..? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు.







