సాయంత్రం సమయం వచ్చిందంటే చాలు.. పిల్లలు, పెద్దలు కలిసి కేరింతలు కొడుతూ సాగరతీరం బాట పడతారు. దీంతో బీచ్‌లు జనసంద్రంగా మారి సందడిగా కనిపిస్తాయి. ముఖ్యంగా సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులు పిల్లలను తీసుకుని బీచ్‌లకు వచ్చి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతుంటారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కుటుంబాలు, మహిళలు, చిన్నారులు బీచ్‌లకు రావడంపై సంకోచించే పరిస్థితులను తీసుకురావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీచ్ షాక్స్ పాలసీకి ఆమోదం లభించింది. భీమిలి, విశాఖపట్నం, శ్రీకాకుళం, చీరాల బీచ్‌లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోవా తరహాలో బీచ్‌ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఈ పాలసీ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్‌ల్లో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వనున్నారు.
ఈ నిర్ణయంతో ఇప్పటివరకు కుటుంబాలు, పిల్లలు ఉల్లాసంగా గడిపే బీచ్‌లు ఇకపై మద్యం సేవించే వారి కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కుటుంబాల సంక్షేమం కంటే మద్యం విక్రయాల పెంపుపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని పలు వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గతంలో జరిగిన కొన్ని వ్యాఖ్యలు, నిర్ణయాలు కూడా మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్–2025 కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. “టీ తాగడానికి టూరిస్టులు బీచ్‌కు వస్తారా? భర్త బీచ్‌లో రెండు పెగ్గులు వేస్తుంటే భార్యలు ఐస్‌క్రీం తింటూ ఎంజాయ్ చేస్తారు” అనే ఆయన వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా, 2014–19 కాలంలో విశాఖ బీచ్‌లో ప్రేమోత్సవం పేరుతో బికినీ ఫెస్టివల్ నిర్వహించే ఆలోచన కూడా తీవ్ర విమర్శలకు గురైంది. టెంట్లు ఏర్పాటు చేసి జంటలకు కేటాయించే ప్రతిపాదనపై మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు అదే నాయకత్వంలోని ప్రభుత్వం బీచ్ ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం మరోసారి సామాజిక, సాంస్కృతిక చర్చలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, తల్లిదండ్రుల వర్గాలు ఈ నిర్ణయంపై ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. బీచ్‌లను పర్యాటక అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రయత్నమా, లేక కుటుంబాలకు దూరమయ్యే వాతావరణానికి నాంది పలుకుతున్న నిర్ణయమా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.






