ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను సూర్య అన్‌ఫాలో చేశాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తన సోషల్ మీడియా బయోలో నుంచి కూడా ముంబై ఇండియన్స్ పేరును తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండటంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.
టీ20 కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత సూర్య తీవ్ర నిరాశలో ఉన్నాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ కారణంగానే ముంబై ఇండియన్స్‌కు కూడా దూరమవుతున్నాడని ప్రచారం సాగుతోంది. మరికొందరు అయితే సూర్య త్వరలోనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఇతర ఫ్రాంచైజీల నుంచి భారీ ఆఫర్లు వచ్చిన కారణంగానే ముంబై అకౌంట్స్‌ను అన్‌ఫాలో చేశాడని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా బీసీసీఐ తాజాగా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించడం కూడా చర్చనీయాంశమైంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యను తప్పించడమే కాకుండా భారత జట్టులో కూడా అతనికి స్థానం ఇవ్వకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. కెప్టెన్‌గా విజయవంతంగా రాణిస్తున్నప్పటికీ ప్లేయర్‌గా మాత్రం సూర్య నిరాశపరిచాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుందని సమాచారం.






