టీడీపీ (TDP) కూటమిలో రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థుల ఎంపిక వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పెద్దల సభకు కార్పొరేట్ వర్గాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేయడంపై ఒకవైపు విమర్శలు వ్యక్తమవుతుండగా, మరోవైపు పార్టీ కోసం సంవత్సరాలుగా శ్రమించిన నేతలకు అవకాశం దక్కకపోవడంపై అసంతృప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. బహిరంగంగా స్పందించిన నాయకులు కొందరే అయినప్పటికీ, అంతర్గతంగా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి (Reddappagari Srinivasulu Reddy) తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయడం ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది. గత 13 ఏళ్లుగా కడప(Kadapa) వంటి క్లిష్ట రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీని(TDP) బలోపేతం చేయడానికి తాను అహర్నిశలు కృషి చేశానని, రాజకీయ, ఆర్థిక, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండాను నిలబెట్టేందుకు పని చేశానని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి చివరకు అమలు చేయకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని సోషల్ మీడియాలో వెల్లడించారు.
గత ఏడాది కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడుకు (TDP Mahanadu) భారీ స్థాయిలో ఖర్చు చేసి, జనసమీకరణతో పాటు నిర్వహణ బాధ్యతలను చేపట్టిన శ్రీనివాసులు రెడ్డి, ఈసారి రాజ్యసభ అవకాశం తనకే వస్తుందని ఆశించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే అవకాశం దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
అదేవిధంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) ఉద్దేశించినట్లుగా కనిపించిన మరో సోషల్ మీడియా పోస్టు కూడా చర్చనీయాంశమైంది. 2024 డిసెంబర్‌లో కడప పర్యటన సందర్భంగా నిర్వహించిన పేరెంట్స్-టీచర్స్ సమావేశానికి (Parents-Teachers Meeting) సంబంధించిన ఖర్చుల బిల్లులు (Expense Bills) ఇప్పటికీ చెల్లించలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు స్వంత నిధులు ఖర్చు చేస్తే 18 నెలల పాటు బిల్లులు పెండింగ్‌లో ఉంచడం సమంజసమేనా అని నిలదీశారు. అనంతరం ఆ పోస్టు తొలగించబడినట్లు ప్రచారం జరిగింది.
ఇక టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) కూడా తాజా పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, గుండుమల తిప్పేస్వామి, టీడీ జనార్ధన్, కంభంపాటి రామ్మోహన్ వంటి పలువురు నాయకులు కూడా రాజ్యసభ అవకాశం రాకపోవడంతో నిరాశకు గురైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ కోసం దీర్ఘకాలంగా శ్రమించిన నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అసంతృప్తి కేవలం వ్యక్తిగత నిరాశగానే మిగిలిపోతుందా? లేక పార్టీ అంతర్గత రాజకీయాల్లో కొత్త చర్చలకు, కొత్త సమీకరణాలకు దారితీస్తుందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.






