విశాఖ ఉక్కు కర్మాగారంలో (Visakhapatnam Steel Plant) జూన్ 8, 2026న జరిగిన ఘోర పేలుడు ఘటనపై మానవ హక్కుల వేదిక (Human Rights Forum) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనను కేవలం దురదృష్టకర ప్రమాదంగా పరిగణించడం సరైంది కాదని, దీని వెనుక యాజమాన్య నిర్లక్ష్యం(Management Negligence), సిబ్బంది కొరత(Staff Shortage), నిర్వహణ లోపాలు(Maintenance Failures), భద్రతా ప్రమాణాల క్షీణత వంటి వ్యవస్థీకృత సమస్యలు (Systemic Issues) ఉన్నాయని వేదిక తన సుదీర్ఘ ప్రకటనలో పేర్కొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ద్రవ ఉక్కు తయారీ ప్రక్రియలో ఉపయోగించే కొన్ని రసాయనిక పదార్థాల (Chemical Materials) నాణ్యత లోపాల కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై పూర్తి స్థాయి సాంకేతిక విచారణ అవసరమని, అదే సమయంలో పరిశ్రమలో చాలాకాలంగా కొనసాగుతున్న లోతైన సమస్యలను విస్మరించరాదని మానవ హక్కుల వేదిక స్పష్టం చేసింది.
గత కొన్నేళ్లుగా విశాఖ ఉక్కు కర్మాగారంలో అనుభవజ్ఞులైన ఉద్యోగులను (Experienced Employees) వారి విభాగాల నుంచి బదిలీ చేసి, అనుభవం తక్కువ ఉన్న సిబ్బందిని కీలక బాధ్యతల్లో నియమించడం వల్ల భద్రతా వ్యవస్థ బలహీనపడిందని పేర్కొంది. భారీ పరిశ్రమల్లో అనుభవం అనేది భద్రతకు కీలకమని, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సిబ్బంది లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
అదేవిధంగా, గత నాలుగేళ్లుగా అవసరమైన స్పేర్ పార్ట్స్ (Spare Parts) కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయని ఉద్యోగులు చెబుతున్న విషయాన్ని కూడా వేదిక ప్రస్తావించింది. ఉక్కు పరిశ్రమ వంటి నిరంతర ప్రక్రియల పరిశ్రమల్లో యంత్రాల నిర్వహణ(Machinery Maintenance), విడిభాగాల మార్పిడి అత్యంత కీలకమని, వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు తప్పవని హెచ్చరించింది.
సిబ్బంది కొరత కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుందని వేదిక పేర్కొంది. దేశంలోని ఇతర సమీకృత ఉక్కు కర్మాగారాలతో పోలిస్తే విశాఖ ఉక్కులో చాలా తక్కువ మంది ఉద్యోగులతో అధిక ఉత్పత్తి లక్ష్యాలు సాధించాల్సి వస్తోందని తెలిపింది. దీనివల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడి పెరిగి, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు భద్రతను ప్రభావితం చేస్తున్నాయని వెల్లడించింది.
కార్మిక సంక్షేమ చర్యలు కూడా క్రమంగా తగ్గిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసిందని పేర్కొంది. ప్లాంట్లోని క్యాంటీన్లు (Canteens) మూతపడటం, దీర్ఘకాలిక షిఫ్టుల్లో కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడం కార్మికుల ఆరోగ్యం, పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల కొందరు అధికార పార్టీ ప్రతినిధులు కార్మికులను “గోస్ట్ ఉద్యోగులు”(“Ghost Employees”)గా అభివర్ణించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని వేదిక పేర్కొంది. వేల డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ప్రాణాలకు తెగించి పనిచేసే కార్మికుల శ్రమను అవమానించడం సమంజసం కాదని, ప్రతి టన్ను ఉక్కు వెనుక వారి కష్టం, త్యాగం, ఆరోగ్యం మరియు కొన్నిసార్లు ప్రాణాలే ఉంటాయని గుర్తు చేసింది.

ఈ ప్రమాదాలు వ్యక్తిగత తప్పిదాల ఫలితాలు కావని, కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, ఖర్చు తగ్గింపు చర్యలు, సిబ్బంది కోతలు, నిర్వహణ నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల క్షీణతల ఫలితమని మానవ హక్కుల వేదిక అభిప్రాయపడింది. తాజా ప్రమాదంపై స్వతంత్ర హైపవర్ కమిటీతో(Independent High-Power Committee) సమగ్ర విచారణ జరిపి నిజాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేసింది.
అలాగే, మరణించిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడం, గాయపడిన వారికి తగిన సహాయం అందించడం, ఖాళీలను వెంటనే భర్తీ చేయడం, అవసరమైన స్పేర్ పార్ట్స్ మరియు భద్రతా పరికరాల కొనుగోళ్లను చేపట్టడం, కార్మిక సంక్షేమ సదుపాయాలను పునరుద్ధరించడం అత్యవసరమని కోరింది.
2012 జూన్ 13న విశాఖ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ విభాగంలో (Oxygen Department) జరిగిన పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తు చేస్తూ, అప్పటి ఎస్.కె. జైన్ కమిటీ నివేదిక (S.K. Jain Committee Report) ఇప్పటికీ బహిర్గతం కాలేదని వేదిక విమర్శించింది. కనీసం ఈసారి అయినా పారదర్శకంగా విచారణ జరిపి నిజాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేసింది.
విశాఖ ఉక్కు కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది వేలాది కుటుంబాల జీవనాధారం, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల పోరాట ఫలితమని పేర్కొన్న మానవ హక్కుల వేదిక, ఈ కర్మాగారాన్ని కాపాడటం అంటే కార్మికుల ప్రాణాలు, గౌరవం, భవిష్యత్తును కాపాడటమేనని స్పష్టం చేసింది.






