కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) కుటుంబానికి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుమార్తె టి.వీణకు (T. Veena) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు (Summons) జారీ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. వీణకు చెందిన ఐటీ సంస్థ ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్’(Exalogic Solutions) ఆర్థిక లావాదేవీలపై మనీ లాండరింగ్ (Money Laundering) ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) సంస్థ నుంచి ఎలాంటి ఐటీ సేవలు అందించకుండానే వీణ సంస్థకు రూ.1.72 కోట్ల నుంచి రూ.2.78 కోట్ల వరకు అక్రమంగా నిధులు బదిలీ అయ్యాయని ఈడీ(ED) అనుమానిస్తోంది. కంపెనీల చట్ట ఉల్లంఘనలతో పాటు అక్రమ ద్రవ్య చలామణి నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలతో జూన్ 12న కొచ్చిలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని వీణకు సమన్లు జారీ చేశారు. ఇదే కేసులో వీణతో పాటు మరో 9 మందికి కూడా నోటీసులు పంపినట్లు సమాచారం.
ఇక ఈ కేసు దర్యాప్తును సవాలు చేస్తూ సీఎంఆర్‌ఎల్ సంస్థ దాఖలు చేసిన అప్పీల్‌ను ఇటీవల కేరళ హైకోర్టు (Kerala High Court) కొట్టివేసింది. ఈడీ తన దర్యాప్తును యథావిధిగా కొనసాగించవచ్చని స్పష్టంగా పేర్కొనడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఇప్పటికే పినరయి విజయన్ నివాసం, వీణ ఇంటి వద్దతో పాటు సీఎంఆర్‌ఎల్ కార్యాలయాల్లో కూడా ఈడీ కీలక సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది.
జూన్ 12న జరిగే విచారణ తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కేరళ రాజకీయాల్లో ఈ కేసు మరింత దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.








